
నాలుగు వారాలుగా నష్టాల్లో పయనిస్తున్న పసిడి మళ్లీ దూకుడు ధోరణి మొదలైనట్లు కనబడుతోంది. ఇదే నాలుగు వారాల్లో ముందుకు ఉరికిన డాలర్ ఇండెక్స్ బలహీనత ఇందుకు ప్రధాన కారణం. శుక్రవారం ట్రేడింగ్ ముగింపు సమయానికి న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,305 డాలర్ల వద్ద ముగిసింది.
సాంకేతికంగా చూస్తే పసిడికి 1,300 డాలర్లు కీలక మద్దతు కావడం గమనార్హం. ఈ స్థాయిని దాటిన తరువాత నాలుగు వారాల క్రితం బంగారం 1,364 డాలర్లను చూసింది. అయితే అటు తర్వాత లాభాల స్వీకరణ, అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపునకు సానుకూల వార్తలు, ఆయా భయాల నేపథ్యంలో దాదాపు 100 డాలర్లు కిందకు జారింది.
దేశీయంగా 400కు పైగా పెరుగుదల
అంతర్జాతీయంగా ప్రభావం దేశీ యంగానూ కనిపించింది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి ధర రూ.278 పెరిగి రూ. 29,851 వద్ద ముగిసింది. ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు వారంవారీగా రూ. 435 ఎగిసి రూ. 29,945కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో పెరిగి రూ. 29,795కి చేరింది. ఇక వెండి కేజీ ధర రూ.1,090 పెరిగి రూ.39,940కి ఎగిసింది. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి విలువ వారం వారీగా 0.77 పైసలు బలపడి 65.44 నుంచి 64.77కు చేరింది.
గత వారం చివరి నుంచే...
నిజానికి అక్టోబర్ 6వ తేదీ శుక్రవారం నుంచీ పసిడి బలోపేతం కావడం ప్రారంభమైంది. ఆ రోజు నుంచీ వారం తిరిగేసరికి 42 డాలర్లు పైకి లేచింది. 6వ తేదీన ఒక దశలో డాలర్ ఇండెక్స్ 94.09ని చూసిన పరిస్థితుల్లో పసిడి 1,264 డాలర్లకు పడిపోయింది.
సెప్టెం బర్‌లో పారిశ్రామికేతర ఉపాధి అవకాశాలు అంచనాలను మించి రాలేదన్న 6వ తేదీ వార్త డాలర్ ఇండెక్స్‌ను 93.62 వద్దకు పడతోయగా, అదే సమయంలో పసిడి తిరిగి 1,279 డాలర్లకు దూసుకుపోయింది. ఆరోజు నుంచీ (6వ తేదీ) డాలర్ ఇండెక్స్ పతనం, పసిడి పరుగు కొనసాగుతోంది. 13వ తేదీ ముగిసిన వారంలో డాలర్ ఇండెక్స్ నాలుగు వారాల పరుగుకు ముగింపు పలుకుతూ వారం వారీగా 0.70 పతనమై 92.92 వద్ద ముగిసింది.
కారణాలు ఇవీ...
అమెరికా సెప్టెంబర్ ద్రవ్యోల్బణం ఉహించినదానికన్నా తక్కువగా ఉండడం, దీనితో వ్యవస్థలో డిమాండ్ ఇంకా తక్కువగానే ఉందన్న సంకేతాలు, ఇలాంటి పరిస్థితి ఉంటే ఫెడ్ ఫండ్ రేటు పెంపు కష్టమన్న అంచనా తాజా వారంలో పసిడి ఊపునకు, డాలర్ బలహీనతకు కారణమయ్యాయి. ద్రవ్యోల్బణం బలహీనత ఇది వరుసగా ఐదవనెల.
ఫెడ్ ఫండ్ రేటు (అమెరికా సెంట్రల్ బ్యాంక్ రేటు.. ప్రస్తుతం 1–1.25 శాతం శ్రేణి) ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడుసార్లు పెంపు తథ్యమని అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ సంకేతాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక అనిశ్చితి ధోరణి, ఉత్తరకొరియా, ఇరాన్‌తో ఘర్షణాత్మక పరిస్థితి వంటి అంశాలు– పసిడి బులిష్ ట్రెండ్‌ను కొనసాగిస్తాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment