జైట్లీకి ద్రవ్యలోటు గుబులు..? | Budget 2014: Arun Jaitley to present maiden Budget amid expectations of tax sops | Sakshi
Sakshi News home page

జైట్లీకి ద్రవ్యలోటు గుబులు..?

Published Mon, Jul 7 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

జైట్లీకి ద్రవ్యలోటు గుబులు..?

జైట్లీకి ద్రవ్యలోటు గుబులు..?

న్యూఢిల్లీ: మోడీ సర్కారు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ద్రవ్యలోటు గుబులు వెంటాడుతోందా? తాజా పరిణామాలు... గణాంకాలు చూస్తే నిజమేనంటున్నారు నిపుణులు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం లోటు లక్ష్యాన్ని అందుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఇప్పుడు జైట్లీ చేతులు కట్టేసేలా చేస్తున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

 అందుకే సమయం చిక్కినప్పుడల్లా ఆర్థిక క్రమశిక్షణకే తమ తొలి ప్రాధాన్యతనీ... ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి గాడిలోపెట్టడానికి కొన్ని కఠిన చర్యలు తప్పవంటూ అటు మోడీ.. ఇటు జైట్లీ ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు కూడా. మతిలేని ప్రజాకర్షక పథకాల జోలికి తాము వెళ్లబోమని కూడా ఇటీవల జైట్లీ కుండబద్దలు కొట్టడానికి ద్రవ్యలోటు సెగే ప్రధాన కారణమని పరిశీలకులు చెబుతున్నారు.

 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో పోలిస్తే 4.1 శాతంగా నిర్ధేశించుకున్నారు. ఒక నిర్ధిష్ట సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసాన్నే ద్రవ్యలోటుగా పేర్కొంటారు. అంటే చిదంబరం సుమారు రూ.5.28 లక్షల కోట్ల లోటును నిర్ధేశించారు.

 ఈ మొత్తాన్ని బాండ్‌ల జారీ ఇతరత్రా ప్రక్రియల్లో ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి వస్తుంది. అంతక్రితం ఏడాది(2013-14)లో ద్రవ్యలోటు సవరించిన అంచనా 4.6 శాతంకాగా, దీనికంటే తక్కువగానే 4.5 శాతంగా(రూ.5.08 లక్షల కోట్లు) నమోదైంది. అయితే, తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే(ఏప్రిల్, మే) రూ.2.4 లక్షల కోట్ల ద్రవ్యలోటు నమోదవడం కొత్త ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అంచనా వేసిన లోటులో 45.6 శాతం కావడం గమనార్హం.

దీనిప్రకారం చూస్తే 4.1 శాతం లక్ష్యం నెరవేరడం అసాధ్యంగానే కనబడుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క, వర్షాభావ పరిస్థితులు కూడా లోటు కట్టడికి అడ్డంకిగా నిలవొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు తొలి రెండు నెలల్లోనే ఇంత లోటు ప్రధాన కారణం గత ప్రభుత్వం చెల్లింపులను వాయిదావేయడమే. వాస్తవానికి ప్రతి సంవత్సరం ఈ తంతు జరుగుతందని.. ఈ సారి కొద్దిగా మోతాదు ఎక్కువైందని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నివాస్ పేర్కొన్నారు. దీంతో జైట్లీకి చిదంబరం సగం ఖాళీ అయిన ఖజానాను అప్పగించినట్లయిందనేది పరిశీలకుల అభిప్రాయం.

 ఎందుకీ పరిస్థితి...
 తొలి రెండు నెలల్లోనే ద్రవ్యలోటు అంచనాల్లో సుమారు సగానికి చేరడానికి చెల్లింపులను కొత్త ఆర్థిక సంవత్సరంలోకి వాయిదా వేయడం ప్రధానంగా నిలిచింది. ఉదాహరణకు పెట్రోలియం శాఖనే తీసుకుంటే మొత్తం వార్షిక బడ్జెట్‌లో 39 శాతాన్ని ఏప్రిల్, మే నెలల్లోనే ఖర్చుకింద చూపింది. గతేడాది ఇదే నెలల్లో ఖర్చు నామమాత్రంగా ఉంది. అంటే గత ప్రభుత్వం చమురు కంపెనీలకు చెల్లించాల్సిన ఇంధన సబ్సిడీ చెల్లింపులను 2014-15లోకి వాయిదా వేసింది. ఈ ప్రభావంతో నిర్ధేశిత లోటు లక్ష్యాన్ని మించిపోయేలా వ్యయం వేగంగా ఎగబాకుతోంది. దీనివల్ల ఈ ఏడాది లోటు అంచనాలను అందుకోవడం కష్టసాధ్యంగా మారనుంది.

 గతేడాది ద్రవ్యలోటు లక్ష్యం కంటే తక్కువగా 4.5 శాతానికి కట్టడయ్యేందుకు ఈ వాయిదా మంత్రంతో పాటు ఆదాయపరంగా ప్రభుత్వ రంగ కంపెనీల నుంచి ఖజానాకు అధిక డివిడెండ్‌లు లభించడం కూడా ఒక కారణంగా నిలిచింది. బడ్జెట్‌లో అంచనా వేసినదానికంటే ప్రభుత్వ కంపెనీల నుంచి 44 శాతం డివిడెండ్ చెల్లింపులు పెరగడం విశేషం. అయితే, ఈ ఏడాది ఈ మొత్తం తగ్గుముఖం పట్టొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఒక ఏడాది అధిక డివిడెండ్‌లను డిమాండ్ చేశాక వరుసగా రెండో సంవత్సరంకూడా ఆ విధంగా ఒత్తిడి చేయడం కష్టమేనన్నది నిపుణుల అభిప్రాయం.

 ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.2.8 లక్షల కోట్లు(మొత్తం వార్షిక అంచనాల్లో 15.9 శాతం) కాగా.. ఆదాయం రూ.38,505 కోట్లు(వార్షిక అంచనాల్లో 3.3 శాతం) మాత్రమే వచ్చింది. కాగా, తాజా పరిస్థితులను గమనిస్తే.. ఈ ఏడాది ద్రవ్యలోటు 4.3-4.5 శాతంగా ఉండొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నెల 10న జైట్లీ ప్రవేశపెట్టనున్న మొట్టమొదటి బడ్జెట్లో మరి ద్రవ్య లోటు అంచనాలను తగ్గిస్తారో... లేదంటే సబ్సిడీల కోత ఇతరత్రా చర్యలతో కట్టడి చేస్తారో వేచిచూడాల్సిందే.

 ఏం చేయాల్సి వస్తుంది...
 ప్రభుత్వ వ్యయాలను అదుపులో పెట్టడం, అనవసర సబ్సిడీల కోతతో పాటు ఆదాయ మార్గాలను పెంచుకోవడం కూడా ద్రవ్యలోటు కట్టడికి చాలా కీలకం. అందుకే ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటాల అమ్మకం(డిజిన్వెస్ట్‌మెంట్) ప్రక్రియను జైట్లీ మరింత వేగవంతం చేసే అవకాశాలున్నాయి.  ఇంకా వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను వీలైనంత వేగంగా అమలు చేయడం, వృద్ధి రేటు పెంపు చర్యలు వంటివి ద్రవ్యలోటును కళ్లెం వేసేందుకు ఉపకరిస్తాయని క్రిసిల్ అభిప్రాయపడింది.

 ఇదిలాఉండగా.. జైట్లీ బడ్జెట్‌లో సంస్కరణల జోరు, ద్రవ్యలోటు కట్టడి చర్యలపైనే తమ భవిష్యత్తు రేటింగ్ అవుట్‌లుక్ ఆధారపడి ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలైన మూడీస్, ఎస్‌అండ్‌పీ చెప్పడం గమనార్హం. అసలే కొత్త ప్రభుత్వం, దీనికితోడు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన నేపథ్యంలో వస్తూనే సబ్సిడీల కోత వంటివి అమలు చేయడం జైట్లీకి కత్తిమీదసామే. అయితే, ఇప్పటికే రైల్వే చార్జీల భారీ పెంపుతో మోడీ కఠిన చర్యల తొలి సంకేతాలొచ్చాయి. మరి బడ్జెట్‌లో మరెన్ని చేదుగుళికలు ఉంటాయో కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement