బాల్కో, హిందుస్థాన్ జింక్ల్లో మిగిలిన వాటా కొంటాం
♦ రూ.25,000 కోట్లు ఇస్తాం
♦ వేదాంత అనిల్ అగర్వాల్ ఆఫర్
న్యూఢిల్లీ: హిందుస్థాన్ జింక్, భారత్ అల్యూమినియం కంపెనీల్లో మిగిలిన ప్రభుత్వ వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పారు. ఈ వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.25,000 కోట్లు(370 కోట్ల డాలర్లు) వస్తాయని వివరించారు. వేదాంత కంపెనీ భారత్ అల్యూమినియం కంపెనీలో 51 శాతం వాటాను 2000-01లో రూ.551.5 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే హిందుస్థాన్ జింక్‌లో 2002-03లో 26 శాతం వాటాను రూ.445 కోట్లకు, ఆ తర్వాత మరో 18.92 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇన్వెస్టర్ల నుంచి మరో 20 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు బాల్కోలో మిగిలిన 49 శాతం వాటాను, హిందుస్థాన్ జింక్‌లో 29.54 శాతం వాటాను కొనుగోలు చేయాలనుకుంటున్నామని అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ వాటాల అసలు విలువ రూ.500 కోట్లు ఉంటుందని, కానీ ఈ వాటాల విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.25,000 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. దేశంలో జింక్ ఉత్పత్తిని నియంత్రించే ఏకైక కంపెనీ అయిన హిందుస్థాన్ జింక్‌లో వాటా విక్రయం సరైన చర్య కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖకు గనుల మంత్రిత్వ శాఖ లేఖ రాసిన నేపథ్యంలో అనిల్ అగర్వాల్ ఈ విధంగా స్పందించారు.