
బెంగళూరు: వచ్చే మూడు, నాలుగేళ్లలో ఆభరణాల మార్కెట్లో వాటాను రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని టైటాన్ సంస్థ నిర్దేశించుకుంది. ఈ విభాగంలో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం 5 శాతంగా ఉంది. తాజా లక్ష్యాన్ని చేరుకునేందుకు వెడ్డింగ్ విభాగం, అధిక విలువ వజ్రాభరణాలు, గోల్డెన్ హార్వెస్ట్ కొనుగోలు స్కీమ్, కస్టమర్లకు ఎక్సే్చంజ్ ప్రోగ్రాం తోడ్పడగలవని కొత్త ఎండీగా నియమితులైన సీకే వెంకటరామన్ తెలిపారు. ప్రధానంగా వెడ్డింగ్ జ్యుయలరీపై మరింతగా దృష్టి సారిస్తున్నామని ఆయన చెప్పారు. టాటా గ్రూప్‌లో భాగమైన టైటాన్.. ’తనిష్క్’ బ్రాండ్ కింద ఆభరణాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పనితీరు గణనీయంగా మెరుగుపడుతోందని, మధ్య–టాప్ స్థాయి విభాగాల్లో కూడా మిగతా జ్యుయలర్స్ నుంచి తమ స్టోర్స్‌కు మళ్లే కొత్త కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని వెంకటరామన్ చెప్పారు. మార్కెట్ వాటాను పెంచుకునే దిశగా 2018–19లో ఇప్పటిదాకా కొత్తగా 40 స్టోర్స్‌ను ప్రారంభించినట్లు వెంకటరామన్ వివరించారు. ఒక ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో స్టోర్స్‌ను ప్రారంభించడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే దూకుడు కొనసాగగలదని వెంకటరామన్ తెలిపారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణింపు..
దాదాపు రూ.14,000 కోట్ల మేర కుంభకోణంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ దెబ్బతీసిన నేపథ్యంలో గతేడాది జ్యుయలరీ పరిశ్రమ పెను సవాళ్లను ఎదుర్కొనాల్సి వచ్చింది. ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ మెరుగ్గా రాణించిన సంస్థల్లో టైటాన్ కూడా ఒకటిగా నిల్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టైటాన్ ఆదాయం 35 శాతం, నికర లాభం 46 శాతం పెరిగింది. ఆభరణాల వ్యాపార విభాగం ఆదాయం 36.95 శాతం పెరిగింది. టైటాన్ మొత్తం ఆదాయంలో దాదాపు 80 శాతం వాటా ఆభరణాల వ్యాపార విభాగానిదే ఉంటుంది. పెరుగుతున్న స్టోర్స్ నెట్‌వర్క్, బ్రాండ్ పేరు, అధిక విలువ ఆభరణాలపై ప్రధానంగా దృష్టి పెడుతుండటం తదితర అంశాల ఊతంతో 2018–21 మధ్యలో తనిష్క్ అమ్మకాలు సుమారు 22 శాతం, స్థూల లాభం 26.5% పెరగొచ్చని బ్రోకరేజీ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ అంచనా వేస్తోంది. గతేడాది కన్నా ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌లో వెడ్డింగ్ ఆభరణాల అమ్మకాలు మరింత భారీగా ఉండగలవని భావిస్తున్నట్లు టైటాన్ ప్రస్తుత ఎండీ భాస్కర్ భట్ ఇటీవలే పేర్కొన్నారు. ప్రస్తుతం వెడ్డింగ్ జ్యుయలరీ విభాగంలో తనిష్క్‌కు 2–3% మార్కెట్ వాటా ఉంటోందని, వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment