
మొండిబకాయిల రికవరీ ఇక వేగవంతం
కీలక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: మొండి బకాయిలు మరింత వేగంగా రికవరీ కావడానికి దోహదపడే కీలక బిల్లును బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని లొసుగులను సరిచేసే క్రమంలో రూపొందిన ‘ది ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్‌ట్రస్ట్ అండ్ రికవరీ ఆఫ్ డెప్ట్ లాస్ అండ్ మిసిలీనియస్ ప్రొవిజన్స్ బిల్లు, 2016కు క్యాబినెట్ ఆమోదం లభించినట్లు అధికారిక ప్రకటన ఒకటి తెలిపింది.
బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు రూ.8 లక్షల కోట్ల మొండిబకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో... నాలుగు కీలక చట్టాల్లో (సర్‌ఫేసీ యాక్ట్ 2002, ది రికవరీ ఆఫ్ డెట్స్ యాక్ట్ 1993, ది ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ 1899, ది డిపాజిటరీ యాక్ట్ 1996) సవరణలకు ఉద్దేశించి ఈ బిల్లు రూపొందింది. అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీలను రెగ్యులేట్ చేయడానికి సైతం ఈ బిల్లు ఆర్‌బీఐకి అనుమతి ఇస్తుంది.