‘వ్యూహాత్మక’ విక్రయానికి ఓకే | Cabinet gives nod to strategic stake sale in PSUs | Sakshi
Sakshi News home page

‘వ్యూహాత్మక’ విక్రయానికి ఓకే

Published Fri, Oct 28 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

‘వ్యూహాత్మక’ విక్రయానికి ఓకే

‘వ్యూహాత్మక’ విక్రయానికి ఓకే

పీఎస్‌యూలపై  కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) మెజారిటీ వాటాల (వ్యూహాత్మక) విక్రయానికి తిరిగి కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో గురువారం ఇక్కడ సమావేశమైన కేబినెట్ ఇందుకు ఆమోదముద్ర వేసింది. సమావేశం తరువాత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు ఈ విషయం తెలిపారు.  లాభాల్లో ఉన్న సంస్థల్లో వాటాల విక్రయాలు కూడా ఉంటాయని ఇప్పటికే ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

వాటాల విక్రయాలకు సిద్ధమవుతున్న  కంపెనీలు ఏమిటన్న ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, ‘ఆయా సంస్థల వాటాల్ని వేలంలో ఉంచినప్పుడే ఈ విషయం వెల్లడవుతుంది’ అని అన్నారు. విక్రయాలకు సంబంధించి నీతి ఆయోగ్ చేసిన సిఫారసులు అన్నింటినీ కేబినెట్ పరిశీలించిందని పేర్కొన్నారు.  వాటాల అమ్మకానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని కూడా తెలిపారు.

పెట్టుబడుల ఉపంసంహరణల విభాగం, ఆయా మంత్రిత్వశాఖలు పరిశీలించిన తర్వాత, వాటాల విక్రయాలకు సంబంధించి కంపెనీ వ్యవహారాలను వేర్వేరుగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  వాటాల విక్రయాలకు ధర మదింపు గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘ఒక నిర్దిష్ట పక్రియలో ఇది ఉంటుంది. ఇక్కడ పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది’ అని అన్నారు.

 రేటు నిర్ణయానికి సూత్రాలు ఖరారు!
విక్రయించాల్సిన ధర విషయంపై ఐదు విధానాలు రూపొందాయి.  ఆయా రంగాల్లో సమాన హోదాలో ఉన్న ఇతర కంపెనీలకు సంబంధించిన ధర, క్యాష్ ఫ్లో బ్యాలెన్స్ షీట్, అసెట్ విలువ, వ్యాపార లావాదేవీ విలువల వంటివి వీటిలో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక వాటాల విక్రయాలకు వివిధ రంగాల్లోని 12 కంపెనీలను గుర్తించినట్లు సమాచారం.

పన్నెండేళ్ల తరువాత..
దాదాపు పన్నెండేళ్ల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. వ్యూహాత్మక వాటాలను ప్రైవేటు కంపెనీలకు విక్రయించడం ద్వారా నిధుల సమీకరణే కాకుండా ఆయా సంస్థల పనితీరు విషయంలో అత్యున్నత స్థాయి సామర్థ్యం, వ్యాపారతత్వం, పారదర్శకత తీసుకుని రావాలన్నది కేంద్రం లక్ష్యం.  నీతి ఆయోగ్ చేసిన సిఫారసుల మేరకు ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం) ఇప్పటికే వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఒక నమూనాను ఖరారు చేసిందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. మొత్తంమీద తాజా జాబితాలో లాభదాయక భారత్ ఎర్త్ మూవర్స్ అండ్ సర్టిఫికేషన్ ఇంజినీర్స్ ఇంటర్నేషనల్‌తో పాటు, నష్టాల్లో ఉన్న స్కూటర్స్ ఇండియా కూడా ఉన్నట్లు సమాచారం.

ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 బడ్జెట్ ప్రసంగంలో వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20,500 కోట్ల సమీకరణలను లక్ష్యంగా నిర్దేశించారు. 2003-04లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం జెసాప్ అండ్ కోలో చివరిసారి వ్యూహాత్మక వాటా విక్రయాలను చేపట్టింది. 1999-2000లో ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలోనే తొలి మెజారిటీ వాటా విక్రయాలు జరగడం గమనార్హం. 1999-2000, 2003-04 మధ్యకాలంలో ప్రభుత్వం 16 ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.6,344 కోట్లు సమీకరించింది. వీటిలో పెట్రో రిటైలర్ ఐబీపీ లిమిటెడ్, ఇండియన్ పెట్రోకెమికల్ కార్పొరేషన్, వీఎస్‌ఎన్‌ఎల్, హిందుస్తాన్ జింక్ వంటి సంస్థలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement