ఐఎఫ్‌సీఐ నిబంధనల ఉల్లంఘన
♦ సగం పైగా రుణాల్లో రూల్స్ అతిక్రమణ
♦ కాగ్ నివేదిక
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఐఎఫ్‌సీఐ దాదాపు 50 శాతం పైగా రుణాల మంజూరీ విషయంలో నిబంధనలను పాటించలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతలు వేసింది. చట్టాలను ఉల్లంఘిస్తూ పలు కంపెనీలకు ఐఎఫ్‌సీఐ భారీ స్థాయిలో రుణాలిచ్చిందని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఆక్షేపించింది. భూషణ్ స్టీల్‌కు రుణాలివ్వడంలో సంస్థలకు నీళ్లొదిలిందని తెలిపింది. ఇందుకు భూషణ్ స్టీల్ తదితర సంస్థలకి రుణాలివ్వడమే నిదర్శనమని పేర్కొంది. రుణభారం పెరిగిపోవడంతో పాటు 2014–15, 2015–16లో భారీ నష్టాలూ చవిచూడటం వల్ల ఆ సంస్థకి ఇచ్చిన రూ. 403 కోట్ల రుణాల రికవరీ సందేహాస్పదమేనని తెలిపింది.
ఇక రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి కూడా నిబంధనలకు విరుద్ధంగా రూ. 500 కోట్లు ఐఎఫ్‌సీఐ మంజూరు చేసిందని పేర్కొంది. అలాగే మోనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ, పిపావవ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజినీరింగ్ కంపెనీ, పిపావవ్ మెరీన్ అండ్ ఆఫ్‌షోర్‌కి రుణాలివ్వడంలోనూ ఐఎఫ్‌సీఐ నిబంధనలను తుంగలో తొక్కిందని వివరించింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ముద్రపడిన ప్రమోటర్లు, డైరెక్టర్లు ఉన్న 3 సంస్థలకు కూడా ఐఎఫ్‌సీఐ రుణాలిచ్చిందని ఆక్షేపించింది.
ఆరు టెల్కోలు రూ. 61వేల కోట్ల ఆదాయాన్ని చూపించలేదు ..
గడిచిన అయిదేళ్లుగా ఆరు టెలికం కంపెనీలు రూ. 61,000 కోట్ల పైగా ఆదాయాలను వెల్లడించకుండా తొక్కిపెట్టి ఉంచాయని కాగ్ వ్యాఖ్యానించింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 7,700 కోట్ల మేర గండిపడిందని పేర్కొంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, సిస్టెమా శ్యామ్ ఇందులో ఉన్నాయి. కాగ్ లెక్కల ప్రకారం 2010–11 నుంచి 2014–15 మధ్య కాలంలో ప్రభుత్వానికి ఎయిర్‌టెల్ రూ. 2,602 కోట్ల మేర లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజి చార్జీలు (ఎస్‌యూసీ) బకాయిపడింది.
వడ్డీ కింద మరో రూ. 1,246 కోట్లు కట్టాల్సి ఉంది. ఇక వొడాఫోన్ రూ. 1,179 కోట్ల వడ్డీతో సహా రూ. 3,332 కోట్లు, ఐడియా రూ. 1,136 కోట్లు (రూ. 658 కోట్ల వడ్డీ కలిపి), రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 1,911 కోట్లు (రూ. 839 కోట్ల వడ్డీ), ఎయిర్‌సెల్ రూ. 1,227 కోట్లు, సిస్టెమా శ్యామ్ రూ. 117 కోట్లు కట్టాల్సి ఉంటుందని కాగ్ పేర్కొంది. కమీషన్లు, డిస్కౌంట్లు మొదలైన వాటిని ఖాతాల్లో సర్దుబాటు చేసేయడం ద్వారా టెల్కోలు తమ వాస్తవ ఆదాయాలను తొక్కి పెట్టి ఉంచాయని వివరించింది.