
కెనరా బ్యాంక్ సీఈఓగా రాకేశ్ శర్మ బాధ్యతలు
బెంగళూరు: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓగా రాకేశ్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. కెనరా బ్యాంక్‌లో చేరడానికి ముందు ఆయన 2014 మార్చి 7 నుంచీ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా పనిచేశారు. బ్యాంకింగ్ రంగంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. పభుత్వ రంగంలోని ఐదు బ్యాంకులకు ఇటీవల కొత్త చీఫ్‌ల ఎంపిక జరిగింది. వీటిలో రెండు బ్యాంకులకు ప్రైవేటు రంగంలోని బ్యాంకింగ్ నిపుణులు చీఫ్‌లుగా నియమితులయ్యారు. ఈ బ్యాంకుల్లో ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)కాగా మరొకటి కెనరాబ్యాంక్. రాకేశ్ శర్మ ప్రైవేటు బ్యాంకు నుంచి ప్రభుత్వ రంగ చీఫ్‌గా నియమితులయినప్పటికీ 33 సంవత్సరాల క్రితం ఆయన కెరియర్ ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో ప్రారంభమైంది. ఎస్‌బీఐలో ఆయన చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి వరకూ పదోన్నతి పొందారు.