వాషింగ్టన్: పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లో సంక్లిష్టత అంశాలు భారత్ వృద్ధి తీరును ప్రతికూలంలోకి నెడుతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ– ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2017 వృద్ధి రేటు అంచనాను ఇంతక్రితం (ఏప్రిల్, జూలై) అంచనాలకన్నా అర శాతం తగ్గిస్తూ 6.7 శాతానికి కుదించింది.
2017 వృద్ధి రేటును సైతం 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గిస్తూ, 7.4 శాతానికి చేర్చింది. ఈ వారం ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల నేపథ్యంలో విడుదలైన ఐఎంఎఫ్ తాజా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదికను చూస్తే...
కోల్పోనున్న ‘వృద్ధి వేగం’ హోదా
2017లో చైనాకన్నా భారత్ వృద్ధి రేటు అంచనా తక్కువగా ఉండడం గమనార్హం. చైనా 2017లో 6.8 శాతం వృద్ధి నమోదుచేసుకోనుంది. ఏప్రిల్ అంచనా కన్నా ఇది (6.6 శాతం) అధికం. ఇదే జరిగితే ఈ ఏడాది ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్ కోల్పోతుంది. అయితే జీఎస్‌టీ వల్ల దీర్ఘకాలంలో వృద్ధి రేటు మళ్లీ 8 శాతం పైకి చేరే అవకాశం ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది.
ప్రపంచ వృద్ధి అంచనా పెంపు
ప్రపంచ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ స్వల్పంగా పెంచింది. 2017లో 3.6% వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ఇంతక్రితం (ఏప్రిల్) 3.5% అంచనాలకన్నా ఇది 10 బేసిస్ పాయింట్లు అధికం. చైనా, జపాన్, రష్యా అలాగే యూరోప్‌లోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాల పురోగతి దీనికి ప్రధాన కారణం. 2018 ప్రపంచ వృద్ధి సైతం 3.7 శాతంగా నమోదవుతుంది. గత అంచనాలకన్నా ఇది 10 బేసిస్ పాయింట్లు అధికం.
Comments
Please login to add a commentAdd a comment