ఆముదం ధరలు పైపైకి?
ముంబై: ఆముదం గింజల ఉత్పత్తి క్షీణిస్తూ ఎగుమతులు వృద్ధి చెందుతుండడంతో నూనె ధరలు పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. 2011-12లో వీటి ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరగ్గా ఆ తర్వాత వరుసగా రెండేళ్లూ ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. 2011-12లో 4 లక్షల టన్నులు, తర్వాతి ఏడాది 4.30 లక్షల టన్నుల ఆముదం నూనె ఎగుమతి అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్ - డిసెంబర్) 3.70 లక్షల టన్నులు ఎగుమతి అయిన నేపథ్యంలో ఏడాది మొత్తమ్మీద 4.6 లక్షల టన్నులు ఎగుమతి కావచ్చని అంచనా. నూనె ఎగుమతులు పెరుగుతున్నాయంటే, అంతకుముందు నిల్వచేసిన గింజలను గానుగ ఆడుతున్నట్లే లెక్క. అంటే, ఆముదం గింజల నిల్వలు తగ్గిపోతున్నాయన్నమాట. ఆముదం నూనె ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచంలోనే 90 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో ఉంది.
భవిష్యత్‌పై ఆశలు...
ఆముదం గింజల ఉత్పత్తి గణాంకాలపై పరిశ్రమ వర్గాల్లో ఏకాభిప్రాయం లేదు. ఉత్పత్తి తగ్గుతోందన్నది మాత్రం స్పష్టం. ఆముదం మార్కెట్ ఫండమెంటల్స్ పటిష్టమవుతున్నాయని ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన గ్లోబల్ కేస్టర్ కాన్ఫరెన్సులో వక్తలు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిన నేపథ్యంలో ఆముదం ధరలు గణనీయంగా పెరుగుతాయని అంచనా. దీంతో ఆముదం రైతులకు మేలు జరగనుంది. సబ్బులు, పెయింట్లు, రెసీన్, వార్నిష్, లూబ్రికెంట్లు, ప్లాస్టిసైజర్ తదితరాల తయారీలో ఆముదాన్ని విరివిగా వినియోగిస్తారు. గతేడాది చైనాకు 2.30 లక్షల టన్నులు, యూరప్‌నకు 1.30 లక్షల టన్నులు, అమెరికాకు 45 వేల టన్నుల ఆముదం నూనె ఎగుమతి అయింది. వివిధ దేశాలకు ఆముదం నూనె ఎగుమతి ద్వారా 85 కోట్ల డాలర్ల (సుమారు రూ.5 వేల కోట్లు) విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ ఆర్జిస్తోంది. దేశీయ ఎగుమతిదార్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ నెలకొని ఉండడంతో ఆముదం నూనెకు తగిన ధరను పొందలేకపోయామని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.