సాక్షి, ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్ చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. వీడియోకాన్ గ్రూప్‌నకు వేలకోట్ల రుణాలిచ్చినందుకుగాను భారీ లబ్ది పొందారన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూతపై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ(పీఈ) చేపట్టింది. ఈ పరిణామాలను ధృవీకరించిన సీబీఐ అధికారులు ఇప్పటికే విచారణ మొదలైందనీ, కొన్ని కీలక పత్రాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆరోపణలు రుజువైతే నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే దీపక్ కొచ్చర్‌ను సీబీఐ ప్రశ్నించే అవకాశంఉంది.
భర్త వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఆమె స్థానాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లను అనుమానితులుగా పేర్కొన్న సీబీఐ ప్రాథమిక దర్యాప్తు చేపట్టనుంది. వీడియోకాన్ నుంచి చందా కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందిందా లేదా అన్నదానిపై విచారించనునుంది. అయితే ఇందులో చందా కొచ్చర్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రుణ వ్యవహారంలో చందా కొచ్చర్ సహాయం చేశారనే దుమారం రేగింది. మరోవైపు ఈ ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంకు డైరక్టర్ల బోర్డు చందాకొచ్చర్‌కు బాసటగా నిలచిన సంగతి తెలిసిందే. అయినా సీబీఐ ముందుకు మరో అడుగువేయడం గమనార్హం.
కాగా వీడియోకాన్‌కు చెందిన వేణుగోపాల్ ధూత్, చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, మరో ఇద్దరు బంధవులు కలిసి 2008లో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. తనకు చెందిన ఒక సంస్థ ద్వారా ధూత్ ఈ కంపెనీకి రూ.64 కోట్లు రుణం ఇచ్చారు. అనంతరం ఇందులో యాజమాన్య హక్కులను కేవలం రూ.9 లక్షలకే దీపక్ కొచ్చర్‌కు చెందిన ట్రస్టుకు ధూత్ బదిలీ చేశారు. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్లు రుణం ఇచ్చిన ఆరు నెలల్లోనే ఈ బదిలీ జరిగింది. ఐసీఐసీఐ ఇచ్చిన రుణంలో రూ.2,810 కోట్లు (దాదాపు 86 శాతం)ను వీడియోకాన్ తిరిగి చెల్లించలేకపోయింది. 2017లో ఇది మొండి బకాయిగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌నకు కొచ్చర్ రుణాలిచ్చేందుకు తోడ్పాటు అందించారని, ఫలితంగా ఆమె కుటుంబీకులు లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment