ప్యాసింజర్ వాహనాలపై ఫోకస్
• సియట్ వైస్ ప్రెసిడెంట్ నితీష్ బజాజ్ వెల్లడి
• తెలుగు రాష్ట్రాల్లోకి పంక్చర్ సేఫ్ టైర్లు విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైర్ల తయారీ సంస్థ సియట్ ప్రధానంగా కార్లు, మోటార్‌సైకిల్ తదితర ప్యాసింజర్ వాహనాల టైర్లపై దృష్టి సారిస్తోంది. ఇందుకు తగ్గట్లుగా కొంగ్రొత్త ఉత్పత్తులు ప్రవేశపెడుతోంది. ‘ప్రస్తుతం మేం ఎక్కువగా ప్యాసింజర్ సెగ్మెంట్‌పై (టూ, ఫోర్ వీలర్లు) ఆ తర్వాత ట్రక్స్ విభాగంపై దృష్టి పెడుతున్నాం. దానికి అనుగుణంగా ఈ సెగ్మెంట్ విక్రయాలు పెంచుకుంటున్నాం. అయిదేళ్ల క్రితం మా ట్రక్ విభాగం విక్రయాలు దాదాపు 60 శాతం ఉండేవి.
ప్రస్తుతం ట్రక్ సెగ్మెంట్ వాటా 40-45 శాతం మేర ఉంటుండగా.. మిగతాది ట్రక్‌యేతర విభాగం వాటా ఉంటోంది’ అని సియట్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) నితీశ్ బజాజ్ సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. ఈ వ్యూహంలో భాగంగానే తాజాగా ద్విచక్ర వాహనాల కోసం తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి పంక్చర్ సేఫ్ టైర్లను ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. వీటి ధర సాధారణ టైర్లతో పోలిస్తే కొంత అధికంగా దాదాపు రూ. 1800-1,900 శ్రేణిలో ఉండగలదని బజాజ్ తెలిపారు.
సుమారు నాలుగు మి.మీ. మందం గల మేకులు గుచ్చుకున్నా పంక్చర్ కాకుండా దృఢంగా ఉండేట్లు రీజెన్ టెక్నాలజీతో ఈ ట్యూబ్‌లెస్ టైర్లను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో వీటిని ప్రవేశపెడుతున్నామని, మరో ఆరునెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని తెలిపారాయన.
మెరుగైన వర్షపాతం, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా డిమాండ్, ఎకానమీ రికవరీ తదితర అంశాల కారణంగా ద్వితీయార్ధంలో వాహన అమ్మకాలు పుంజుకుని, టైర్ల విక్రయాలు మరింత మెరుగ్గా ఉండగలవని ఆశిస్తున్నట్లు బజాజ్ వివరించారు. ప్రస్తుతం 8 శాతం మేర వృద్ధి సాధిస్తున్న పరిశ్రమ రెండంకెల స్థాయిని నమోదు చేయగలదని అంచనాలున్నట్లు చెప్పారు. విలువపరంగా టైర్ల మార్కెట్లో తమకు 10-12 శాతం వాటా ఉందని తెలిపారు.
అమ్మకాలు దాదాపు రూ. 6,500 కోట్ల మేర ఉండగా.. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా సుమారు పది శాతం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా సొంత ప్లాంట్లు నాలుగు, శ్రీలంకలో ఒకటి ఉన్నాయని, కొత్తగా మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో మరో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని బజాజ్ తెలిపారు. ఇది వచ్చే ఆరు-తొమ్మిది నెలల్లో అందుబాటులోకి రాగలదని, అటు బంగ్లాదేశ్‌లోనూ ప్లాంటు ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.