హోండా చౌక బైక్ వచ్చేసింది | HMSI launches 'Honda is Honda' campaign | Sakshi
Sakshi News home page

హోండా చౌక బైక్ వచ్చేసింది

Published Sat, Jul 5 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

హోండా చౌక బైక్ వచ్చేసింది

హోండా చౌక బైక్ వచ్చేసింది

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ కొత్త మోటార్ సైకిల్,  సీడీ 110 డ్రీమ్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. ధర రూ. 41,100(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది.  హోండా కంపెనీ నుంచి వస్తోన్న  అత్యంత చౌక బైక్ ఇది. 110 సీసీ కేటగిరీలో కంపెనీ అందిస్తోన్న డ్రీమ్ బ్రాండ్ మూడో బైక్ కూడా. ఈ కొత్త సీడీ 110 బైక్ ధర, ఈ కంపెనీయే విక్రయిస్తున్న ఈ కేటగిరీ మోటార్‌సైకిళ్లు -డ్రీమ్ నియో బైక్ కంటే రూ.5,000, డ్రీమ్ యుగ కంటే రూ.7,000 తక్కువ. గ్రామీణ, మాస్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా హోండా కంపెనీ ఈ బైక్‌ను తెస్తోంది. 100-110 సీసీ సెగ్మెంట్ అవసరాలను తీర్చేలా ఈ బైక్‌ను అందిస్తున్నామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) యద్విందర్ ఎస్. గులేరియా పేర్కొన్నారు.

 వచ్చే నెల నుంచి విక్రయాలు
 ఇతర హోండా డ్రీమ్ బైక్‌ల్లో ఉపయోగించే 110 సీసీ ఇంజిన్‌నే ఈ సీడీ 110 డ్రీమ్ బైక్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. హోండా ఈకో టెక్నాలజీ(హెచ్‌ఈటీ) కారణంగా ఈ బైక్ 74 కి.మీ. మైలేజీని ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. వచ్చే నెల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ట్యూబ్‌లెస్ టైర్లు, విస్కస్ ఎయిర్ ఫిల్టర్ తదితర ఫీచర్లున్నాయి. హీరో మోటోకార్ప్‌కు చెందిన హెచ్‌ఎఫ్-డీలక్స్, టీవీఎస్ స్టార్ సిటీలకు ఇది గట్టిపోటీనిస్తుందని పరిశ్రమవర్గాల అంచనా.

ఇతర డ్రీమ్ బైక్‌లకు, ఈ తాజా బైక్‌కు పెద్దగా తేడా లేదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. సిల్వర్ కలర్ అలాయ్ వీల్స్, బాడీ గ్రాఫిక్స్ మాత్రం విభిన్నంగా ఉన్నాయి. రూర్బన్(రూరల్, ఆర్బన్) వినియోగదారులు లక్ష్యంగా కంపెనీ ఈ బైక్‌ను అందిస్తోంది.  ఈ బైక్ మూడు రంగుల్లో లభ్యమవుతుంది. నలుపు రంగుపై రెడ్, బ్లూ, గ్రే చారలతో ఈ బైక్ లభిస్తుంది. డీలర్లకు డిస్పాచెస్ ఈ నెల రెండో వారం నుంచి కంపెనీ ప్రారంభిస్తుంది. త్వరలో హోండా 160 సీసీలో కొత్త బైక్‌ను తేనున్నది.

 25% వాటా...
  ఈ కంపెనీ ప్రస్తుతం 100-110 సీసీ సెగ్మంట్లో డ్రీమ్ యుగ, డ్రీమ్ నియో, సీబీ ట్విస్టర్ మోడళ్లను విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 100-110 సీసీ సెగ్మెంట్లో 7.3 లక్షల బైక్‌లను విక్రయించామని గులేరియా చెప్పారు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కొత్త బైక్‌తో ఈ సంఖ్య 8 లక్షలకు చేరగలదని  ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో భారత టూ-వీలర్ కేటగిరీలో 25 శాతం మార్కెట్ వాటా సాధించామని చెప్పారు.

 హోండా ఈజ్ హోండా
  గత ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్యకలాపాల నిమిత్తం రూ.5,200 కోట్లు పెట్టుబడులు పెట్టామని గులేరియా వివరించారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో  ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొన్నారు.  ప్రస్తుతం ఈ కంపెనీ మానేసర్(హర్యానా), తపుకుర(రాజస్థాన్), నర్సాపుర(కర్నాటక)ల్లోని మూడు ప్లాంట్లలో టూవీలర్లను తయారు చేస్తోంది. ఈ మూడు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46 లక్షలు. నాలుగో ప్లాంట్ గుజరాత్‌లో నిర్మాణంలో ఉంది. నాలుగో ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తే వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 58 లక్షలకు పెరుగుతుంది.  హోండా ఈజ్ హోండా... పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ఈ కంపెనీ ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement