సిమెంటుకు రవాణా వ్యయమే అడ్డంకి
♦ వ్యయాలు తగ్గితే ఎగుమతులకు ఊతం
♦ భారతి సిమెంట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని సిమెంటు కంపెనీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46.1 టన్నులకు చేరుకుంది. వినియోగం 28.5 కోట్ల టన్నులుంది. ఇందులో పొరుగునున్న దేశాలకు ఏటా 60 లక్షల టన్నుల సిమెంటు ఎగుమతి అవుతోందని భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్ల వినియోగం 50 శాతం ఉండడంతో ఎగుమతులపై ఇక్కడి కంపెనీలు దృష్టిపెట్టాయని తెలియజేశారు. అయితే పరిశ్రమకు రవాణా వ్యయమే పెద్ద అడ్డంకిగా అభివర్ణించారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతయ్యే సిమెంటు విక్రయ ధరలో రవాణా వ్యయం 44 శాతం ఉంటోందని గుర్తు చేశారు.
రైలు మార్గంలో నౌకాశ్రయాలకు నల్లగొండ క్లస్టర్ నుంచి దూరం 461 కిలోమీటర్ల వరకు, కడప క్లస్టర్ నుంచి 652 కిలోమీటర్ల వరకు ఉందని తెలియజేశారు. కంటైనర్ కార్పొరేషన్, రైల్వేల వంటి సంస్థలు రవాణా వ్యయం తగ్గేందుకు కృషి చేయాలని కోరారు. తద్వారా సిమెంటు ఎగుమతులకు ఊతమిచ్చినట్టు అవుతుందని చెప్పారాయన.
ఆలస్యమవుతున్న ఎగుమతులు..
యూఎస్, యూరప్ తదితర పశ్చిమ దేశాలకు ఔషధ ఎగుమతులకు హైదరాబాద్ నుంచి 60 రోజుల దాకా సమయం పడుతోందని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఇఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) చైర్మన్ మదన్ మోహన్‌రెడ్డి తెలిపారు. సమీప నౌకాశ్రయాల నుంచి పశ్చిమ దేశాలకు నేరుగా కనెక్టివిటీ లేకపోవడం, ముంబై పోర్టు రద్దీ దృష్ట్యా కొలంబో మీదుగా నౌకల్లో సరకు ఎగుమతి చేయాల్సి వస్తుండడం ఇందుకు కారణమన్నారు. తయారీ 30 రోజుల్లో పూర్తి అయినప్పటికీ, కంపెనీలు సమయానికి సరుకు డెలివరీ చేయలేకపోతున్నాయని గుర్తు చేశారు. పరోక్షంగా ఇక్కడి పరిశ్రమపై ఇది ప్రభావం చూపిస్తోందని అన్నారు.
హైదరాబాద్‌లోని ఔషధ కంపెనీలకు ఎగుమతులకుగాను రవాణా వ్యయం 10–11 శాతం అవుతోంది. దీనిని 5–6 శాతానికి చేర్చడం సాధ్యమేనని ఆయన అన్నారు. కస్టమ్స్ అనుమతులకు గతంలో 7–11 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు సరుకు దిగే సమయానికే అన్ని క్లియరెన్సులు ఇస్తున్నట్టు హైదరాబాద్ కస్టమ్స్ కమిషనరేట్ అదనపు కమిషనర్ ఆర్.కె.రామన్ తెలిపారు. సమ్మిట్‌లో ఫ్యాప్సీ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్, బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ జయంత్ టాగోర్, మారిటైమ్ గేట్‌వే పబ్లిషర్ రామ్‌ప్రసాద్ మాట్లాడారు.