వైఎస్సార్ జిల్లా, సాక్షి: సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ ఏపీలో వేధింపుల పర్వం కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం. వైఎస్సార్‌సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి.. ఆయన కుటుంబాన్ని సైతం నడిరోడ్డుకు లాగింది. అదుపులోకి తీసుకోవడం దగ్గరి నుంచి జడ్జి ముందు హాజరపర్చడం దాకా అంతా గోప్యత, హైడ్రామాను నడిపించారు పోలీసులు.
గత అర్ధరాత్రి దాటాక వర్రా రవీంద్రారెడ్డిని కడప 2వ ఏడీజేఏం ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్రా పేర్కొన్నాడు.
‘‘శుక్రవారం నన్ను అరెస్టు చేసి ఎక్కడెక్కడో తిప్పి టార్చర్ చేశారు సర్(తనకు అయిన గాయాలను జడ్జికి చూపించారు). వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన పీఏ ప్రోద్బలంతోనే షర్మిల, సునీతలపై పోస్టులు చేశానని చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. అందుకు ఒప్పుకోకపోవడంతో టార్చర్ చేశారు సర్. మేం ఏది చెప్పినా ‘యస్’ అనాలని వీడియో రికార్డు చేశారు సర్’’ అంటూ జడ్జి ఎదుట వాపోయారాయన. ఆ వివరాలన్నింటిని జడ్జి రికార్డు చేశారు. రవీంద్రారెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అదే సమయంలో.. రవీంద్రా రెడ్డి ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. మరోవైపు.. ఇదే కేసులో అరెస్ట్ అయిన సుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డికి 41-ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఆయన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. జడ్జి ఆదేశాల నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలకు తీసుకెళ్లనున్నారు. అనంతరం మళ్లీ కడప జైలుకు తరలించారు.
‘‘వర్రా రవీంద్రారెడ్డి ఎక్కడికి పారిపోలేదు. పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ వెళ్లారు. శుక్రవారం ఆయన్ని అదుపులోకి తీసుకుని టార్చర్ చేశారు. కర్నూలు టోల్ ప్లాజా సమీపంలో కళ్లకు గంతలు కట్టి వేధించారు. అరికాళ్లపై రాడ్లతో చితకబాదారు. మార్కాపురం తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. ఆయన మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి’’
::: సాక్షితో రవీంద్రారెడ్డి తరఫు అడ్వొకేట్ ఓబుల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment