భగ్గుమన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
చెన్నై: కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన 7 వ వేతన సంఘం సిఫారసుల ఆమోదం పై నిరసనల సెగ అప్పుడే రగిలింది. తమిళనాడులోని చెన్నై లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగారు. బుదవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన సిఫారసులపై భగ్గుమన్న కేంద్ర ప్రబుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సిఫారసులకు ఆమోదం లభించినప్పటికీ ఉద్యోగులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అరకొరా చెల్లింపులను ఆమోదించారని, కంటితుడుపు చర్యగా ఉన్నాయని ఆరోపించారు.
అయితే సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ 7వ వేతన సంఘం సిఫారసుల ఆమోదంపై స్పందించారు. తాను తన సూచనలు అందించాననీ, వాటిలో కొన్నింటికి ఆమోదం లభించిందని తెలిపారు. ఇక మిగిలిన వ్యవహారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చూస్తారని వ్యాఖ్యానించారు.
కాగా గతం కంటే తక్కువగా అంటే గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 14.2 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసి ఉద్యోగులను అవమానించిందని గతంలో కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎల్‌పీజీ విధానాల్లో భాగంగా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్‌లు 16 శాతం కంటే ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇవ్వవద్దనే షరతులు విధించిన నేపథ్యంలోనే ఈ సిఫారసులని వాదించాయి. ఏడో వేతన సంఘం అంతకు మించి చేస్తుందని ఉద్యోగులు ఆశిస్తే ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించాయి. దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని కూడా హెచ్చరించాయి.