బంగారం, వెండిపై జీఎస్టీ భారమెంత?
బంగారం, వెండిపై జీఎస్టీ భారమెంత?
Published Fri, May 12 2017 1:46 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM
న్యూఢిల్లీ : ఏకీకృత వస్తుసేవల పన్ను విధానం అమలుకు ఇంకా కొన్ని రోజులే సమయముంది. బంగారం, వెండిపై ఎంత పన్ను రేటు విధించాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే బంగారం, వెండిపై 4 శాతం జీఎస్టీ విధింపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఫైనాన్సియల్ సర్వీసెస్ లపై ప్రత్యేక రేటును నిర్ణయించనున్నట్టు సమాచారం. జూలై నుంచి జీఎస్టీ అమలుకు రంగం సిద్దమవుతుండగా.. బంగారం, వెండి సెక్టార్ల నుంచి లాబీయింగ్ జోరుగా సాగుతోంది. దక్షిణ ప్రాంత రాష్ట్రాల్లో బంగారం, వెండిపై 6 శాతం లెవీకి మొగ్గుచూపుతుందడగా.. కొన్ని రాష్ట్రాలు 5 శాతం వరకు వ్యాట్ కే సమ్మతిస్తున్నాయి. కొన్ని పశ్చిమరాష్ట్రాలు చాలా తక్కువగా 1 శాతానికే ఓకే చెబుతున్నాయి. వస్తువులపై శ్లాబులు నిర్ణయించిన జీఎస్టీ కౌన్సిల్, బులియన్, సర్వీసులపై నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే సర్వీసులపై రెండు విధాల జీఎస్టీ రేట్లుంటాయని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా సంకేతాలిచ్చారు.
18 శాతం, 12 శాతం లెవీని సర్వీసులపై విధించనున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం, వెండి జీఎస్టీ రేట్లపైనే కాక, హ్యాండ్ లూమ్, హ్యాండీ క్రాఫ్ట్స్, బీడీలను టాక్స్ నెట్ లోకి తీసుకురావాలా? లేదా? అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధినేతగా రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కూడిన అత్యున్నత నిర్ణయాత్మక బాడీ జీఎస్టీ కౌన్సిల్ ఈ మేరకు చర్చలు జరుపుతోంది. బీడీలను ప్రస్తుతం టాక్స్ నెట్ నుంచి మినహాయింపు ఉంది. కానీ వీటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటిపై నిర్ణయాలు తీసుకోవడానికి జీఎస్టీ కౌన్సిల్ మే 18, 19న శ్రీనగర్ లో భేటీ నిర్వహించబోతుంది.
Advertisement
Advertisement