
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు అదుపు దాటిపోతున్న నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల స్థాయి దాటితే ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా వంటి ఉత్పత్తి కంపెనీలకొచ్చే అదనపు ఆదాయం ప్రభుత్వానికి దఖలు పడేలా చూసే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సెస్సు రూపంలో వచ్చే ఈ మొత్తాన్ని చమురు మార్కెటింగ్ కంపెనీలకు సర్దుబాటు చేయడం ద్వారా అవి రేట్లను మరింతగా పెంచకుండా చూడొచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. రిటైల్ స్థాయిలో రేట్లు భారీగా పెరగకుండా చూసేందుకు ఎక్సైజ్ సుంకం రేట్లలో స్వల్ప మార్పులు, చేర్పులు చేయడంతో పాటు వ్యాట్ తగ్గించేలా రాష్ట్రాలకు కూడా సూచించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంక్షేమ పథకాలకు తగినన్ని నిధులు సమకూర్చుకునే ఉద్దేశంతో ఆర్థిక శాఖ ఎక్సైజ్ సుంకాలను తగ్గించడానికి ససేమిరా అంటున్న నేపథ్యంలో తాజా ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.
సాధారణంగా దేశీ చమురు కంపెనీలు క్రూడాయిల్‌ను దేశీయంగానే ఉత్పత్తి చేసినా.. అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా రేటు లభిస్తుంది. తాజా ప్రతిపాదన ప్రకారం ముడిచమురు బ్యారెల్ ధర 70 దాటిన పక్షంలో ఉత్పత్తి కంపెనీలకు వచ్చే అదనపు ఆదాయాలను .. మార్కెటింగ్ కంపెనీలకు మళ్లించడం ద్వారా రిటైల్ రేట్లు పెరగకుండా చూడొచ్చన్నది కేంద్రం భావన. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ చమురు ఉత్పత్తి సంస్థలన్నింటిపైనా ఈ సెస్సును విధించడం ద్వారా విమర్శలు రాకుండా చూసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2008లో చమురు రేట్లు భారీగా పెరుగుతున్నప్పుడు కూడా ఇటువంటి ప్రతిపాదనే వచ్చినప్పుడు కెయిర్న్ ఇండియా వంటి ప్రైవేట్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బ్రిటన్, చైనా తదితర దేశాల్లో ఈ తరహా విధానం అమల్లో ఉంది. ఓఎన్‌జీసీ, ఆయిల్ షేర్ల పతనం: సెస్సు ప్రతిపాదన నేపథ్యంలో గురువారం ఆయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ షేర్లు క్షీణించాయి. బీఎస్‌ఈలో ఓఎన్‌జీసీ షేర్లు 4.5 శాతం పతనమై రూ. 167.65 వద్ద క్లోజయ్యాయి. ఇంట్రాడేలో ఏకంగా 11.44 శాతం క్షీణించి రూ. 155.45 స్థాయిని కూడా తాకాయి.