న్యూఢిల్లీ : భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకుతూ.. హడలెత్తిస్తున్నాయి. స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్, రవాణా ఖర్చుల్లో మార్పుతో ఒక నగరానికి, మరో నగరానికి ధరల్లో మార్పు కనిపించినప్పటికీ, చాలా నగరాల్లో మాత్రం ధరలు వాత పెడుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే, మహారాష్ట్రలోని పర్బానీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.45రూపాయలతో అత్యధికంగా ఉంది. లీటర్ డీజిల్ ధర హైదరాబాద్‌లో అత్యధికంగా 79.73 రూపాయలు ఉంది.
ఇంతలా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు వాతపెడుతుంటే, భారత్‌లోనే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ఐలాండ్‌లో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.69.97కే లభ్యమవుతోంది. కానీ అదే ఇంధనం మహారాష్ట్రలో రూ.90.45 పలుకుతుంది. అంటే మహారాష్ట్రలోని పర్బానీతో పోల్చుకుంటే, అండమాన్ నికోబార్‌లో లీటర్ పెట్రోల్ 20 రూపాయలు తక్కువకు దొరుకుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం రెండు వ్యాట్ శ్లాబులు అమలవుతున్నాయి. దీంతో పెట్రోల్ ధరలు ఆ రాష్ట్రంలో వాసిపోతున్నాయి.
అండమాన్‌లోని పోర్ట్ బ్లయర్‌తో పాటు గోవా రాజధాని పనాజీలో కూడా లీటర్ పెట్రోల్ రూ.74.97, అగర్తలలో 79.71రూపాయలకే లభ్యమవుతోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో 80రూపాయలకు పైగానే ఉంది. ఈ మూడు చోట్ల తప్ప. ఇదిలా ఉంటే, తెలంగాణలోనే డీజిల్ ధర అధికంగా ఉంది. దీనికి కారణం అధిక వ్యాట్. తెలంగాణలో డీజిల్‌పై విధించే వ్యాట్ 26.01 శాతంగా ఉంది. దీంతో తెలంగాణలో డీజిల్ ధర అమాంతం పెరిగిపోయి,లీటరు రూ.79.73గా నమోదవుతోంది. చత్తీష్‌గడ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో కూడా డీజిల్ ధర అధికంగా ఉంది. అమరావతిలో లీటరు డీజిల్ ధర రూ.78.81గా, తిరువనంతపురంలో రూ.78.47గా, రాయ్‌పూర్‌లో రూ.79.12గా, అహ్మదాబాద్‌లో రూ.78.66గా ఉన్నాయి.
అయితే డీజిల్ కూడా పోర్ట్ బ్లేయర్, ఇటానగర్, ఐజ్వాల్‌లలో చాలా చౌకగా లభ్యమవుతుంది. పోర్ట్ బ్లేయర్‌లో రూ.68.58గా ఉన్న డీజిల్ ధర, ఇటానగర్‌లో రూ.70.44గా, ఐజ్వాల్‌లో రూ.70.53గా ఉంది. అండమాన్, నికోబార్ ఐల్యాండ్, పోర్ట్ బ్లైర్‌లు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికి బెస్ట్ ప్లేస్‌గా నిలుస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత తక్కువగా ఉండటానికి కారణమేంటంటే.. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్రోల్, డీజిల్‌పై 6శాతం మాత్రమే వ్యాట్‌ను విధిస్తారు. అందువల్ల ఇక్కడ పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు లభిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment