పిల్లల భవిత చల్లగా! | children's future in life event in bright | Sakshi
Sakshi News home page

పిల్లల భవిత చల్లగా!

Published Mon, Dec 21 2015 3:01 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

పిల్లల భవిత చల్లగా! - Sakshi

పిల్లల భవిత చల్లగా!

* ఉన్నత విద్య, వివాహాలకు పొదుపు తప్పనిసరి      
* పలు సాధనాల్లో మదుపు చేయటమే మంచిది

మీకే కాదు! ఏ తల్లిదండ్రులకైనా పిల్లలే ప్రపంచం. ఆ ప్రపంచం చుట్టూ కలలు అల్లుకునేది కూడా తల్లిదండ్రులే. మరి ఈ కలల్ని నిజం చేసుకోవాలంటే..? ఇతరత్రా అంశాలతో పాటు ఆర్థికంగా బలంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలు పెరిగే కొద్దీ వారి నిత్యావసరాల నుంచి చదువు దాకా అన్నీ ముడిపడి ఉన్నది డబ్బుతోనే. విద్యా సంబంధమైన ఖర్చులు పెరుగుతున్న తీరు మనకు తెలియంది కూడా కాదు.

అసోచామ్ అంచనా ప్రకారం... గడిచిన పదేళ్లలో విద్యా  సంబంధ ఖర్చులు ఏకంగా 150 శాతం పెరిగాయి. మున్ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందన్నది నిపుణుల మాట. దీనర్థం... మీ పిల్లలకోసం ఇన్వెస్ట్ చేయటమన్నది తప్పనిసరి ప్రాధాన్యం. సరే! మరి ఈ పొదుపు, పెట్టుబడికి సరైన పథకాలేంటి? నిజానికిది ఎప్పటికీ చిక్కు ప్రశ్నే. ఒకో సమయంలో ఒకో రకమైన సాధనాలు అందుబాటులోకి వస్తుంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలను విశ్లేషించినపుడు ఏఏ పథకాలు మెరుగైనవిగా తేలాయంటే...
 
బంగారంపై పెట్టుబడి
మార్కెట్లు భారీ కుదుపులకు లోనవుతున్న తరుణంలో బంగారంపై దీర్ఘకాలిక పెట్టుబడులనేవి సురక్షిత సాధనంగా పనికొస్తాయి. ‘‘బంగారంలో పెట్టుబడులను ఈటీఎఫ్‌ల ద్వారా, గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్ల ద్వారా, ఈ-గోల్డ్ ద్వారా చేయొచ్చు. అయితే భౌతికంగా బంగారం కొనటం మాత్రం సరైన పెట్టుబడి మార్గం కాదనే చెప్పాలి. ఎందుకంటే దీన్ని దాచటం సమస్యే. పెపైచ్చు తరుగు కూడా  పోతుంటుంది.

పేపర్ గోల్డ్ గనక కొంటే అది మార్కెట్ ధరకే దొరుకుతుంది కనక అది కూడా బంగారాన్ని కొన్నట్టే. గోల్డ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టినా అంతే’’ అని ‘జెన్ మనీ’ కమాడిటీ నిపుణుడు ఆర్.నమశ్శివాయ తెలియజేశారు. కాగా మీ పోర్టుఫోలియోలో బంగారంపై పెట్టే మొత్తం 10 నుంచి 15 శాతం మించకుండా చూసుకోవటం ఉత్తమం’’ అని ఆయన వివరించారు.
 
భవిష్యత్తు లక్ష్యాల రక్షణ తప్పనిసరి! అనుకోని దుర్ఘటనలు జరిగినా కూడా మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇబ్బంది రాకూడదని భావిస్తే అందుకు తగ్గ బీమా రిస్కు కవరేజీ కూడా తీసుకోవాలని జెన్ మనీకి చెందిన ఫైనాన్షియల్ అనలిస్టు జాగర్లమూడి వేణుగోపాల్ చెప్పారు.
 
ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్లు
నిజానికి ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్లనేవి ప్రాధాన్యంలో ఎప్పుడూ ముందే ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణాలేంటంటే... ఇన్వెస్ట్‌మెంట్‌కు పది నుంచి 15 ఏళ్ల దీర్ఘ కాలం వ్యవధి ఉండటం. రెండు... క్రమంగా పెట్టుబడి పెట్టేందుకు సిప్ వంటి విధానం అందుబాటులో ఉండటం. ‘‘నెలకు రూ.5వేల చొప్పున వరసగా 18 ఏళ్ల పాటు సిప్ పద్ధతిలో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అది ఏకంగా రూ.33 లక్షలయ్యే అవకాశం ఉంటుంది.

ఏడాదికి 12 శాతం రాబడిని అంచనా వేయటంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు కూడా.  ఏడాదికి 6 శాతం చొప్పున ద్రవ్యోల్బణం పెరుగుతుందని అనుకున్నా... ఈ మొత్తం దాన్ని అధిగమిస్తుంది. కాకపోతే ఇందులో ప్రధానమైనది ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నామనేది కాదు. ఎన్నాళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తున్నామనేది. కాంపౌండింగ్‌కు ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు.

దీర్ఘకాలంలో 12 నుంచి 15 శాతం రాబడులనిచ్చిన చరిత్ర ఈక్విటీ ఫండ్లకుంది. పెపైచ్చు దీర్ఘకాలంలో మీ ఖర్చును యావరేజ్ చేయడానికి సిప్‌ను మించిన విధానం లేదు కూడా’’ అని హైదరాబాద్‌లోని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవీరెడ్డి వివరించారు.
 
పీపీఎఫ్
చాలామంది నిపుణులు దీన్నే తమకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి సాధనంగా పేర్కొన్నారు. ఎందుకంటే దీనికి వేలు పెట్టడానికి వీల్లేని ‘ఇఇఇ’ ఫీచర్ ఉంది. ట్రిపుల్ ఇ... అంటే ఇన్వెస్ట్ చేసేటపుడు గానీ, వడ్డీపై గానీ, మెచ్యూరిటీ మొత్తంపై గానీ ఎక్కడా పన్ను లేకపోవటమన్న మాట. పెపైచ్చు దీని కాల వ్యవధి 15 సంవత్సరాలు. అంటే.. పిల్లల చదువుకు గానీ, వివాహానికి గానీ సరిగ్గా సరిపోయే సమయం. దీన్లో ఉన్న మరో ప్రధాన ఆకర్షణ ఏంటంటే... సరళమైన పెట్టుబడి విధానం.

కనిష్ఠంగా ఏడాదికి రూ.500 కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అది కూడా మీకు కుదిరిన సమయంలో. కాకపోతే ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షలకు మించి మాత్రం పెట్టుబడి పెట్టే అవకాశం లేదు. పిల్లల పేరుతో పాటు మీ ఖాతా నుంచి మీ పేరిట కూడా పెట్టుబడి పెట్టిన పక్షంలో... రెండు ఖాతాల కింద రూ.3 లక్షల దాకా పెట్టుబడి పెట్టొచ్చు.
 
స్వల్పకాలానికి డెట్ సాధనాలు...
స్వల్ప, మధ్యకాలిక అవసరాల కోసం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయలేం. ఎందుకంటే అక్కడ హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉంటాయి. ‘‘మార్కెట్ రిస్కుకు దూరంగా ఉండటానికి స్వల్పకాలిక ఫండ్లు, ఇన్‌కమ్ ఫండ్లు, బాండ్ ఫండ్లు (తక్కువ వ్యవధి) వంటి డెట్  సాధనాల్ని పరిశీలించవచ్చు. వీటిలో ఇన్వెస్ట్ చేయటం వల్ల రాబడి శాతం 6 నుంచి 8 మించకపోవచ్చు. కాకపోతే రిస్కు కూడా చాలా తక్కువగా ఉంటుంది’’ అని వేణుగోపాల్ వివరించారు. వీటన్నిటితో పాటు మీ పిల్లలకు డబ్బు ప్రాధాన్యం గురించి తెలియజేయండం ఎంతో ప్రయోజనకరం.
 
సుకన్య సమృద్ధి పథకం...
ఆడపిల్లల చదువు కోసం కేంద్ర ప్రభుత్వం ఆరంభించిన పథకమిది. ఈ పథకాన్ని మీ అమ్మాయి పుట్టినప్పటి నుంచి తనకు పదేళ్ల వయసు వచ్చేదాకా ఎప్పుడైనా ఆరంభించొచ్చు. పదేళ్లు దాటిన అమ్మాయిలున్నా, లేకపోతే అబ్బాయిల తల్లిదండ్రులైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కుదరదు. ఏడాదికి కనీసం రూ.వెయ్యి నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు.

ఇలా వరసగా 14 ఏళ్లపాటు చేయొచ్చు. ఈ పథకం కింద ఖాతా తె రిచిన 21 సంవత్సరాలకు మెచ్యూరిటీ సొమ్ము చేతికొస్తుంది. ఏడాదికి 9.2 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తారు. కాకపోతే పీపీఎఫ్ మాదిరిగా దీనిపై కూడా వడ్డీ రేటు మారే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో పెట్టే పెట్టుబడులకు సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చిన పక్షంలో పాక్షికంగా విత్‌డ్రాయల్ చేసుకోవటానికి అనుమతి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement