ఇంటి విలువతోపోలిస్తే అద్దె రూపంలో వచ్చే ఆదాయం చాలా స్వల్పంగా ఉంటుంది. అందుకే, సొంత నివాసం కోసం కాకుండా అద్దెకు ఇచ్చే ఇంటి విషయంలో ఆదాయం గురించి యజమానులు చాలా సందర్భాల్లో పునరాలోచన చేస్తుంటారు. మరింత అద్దె ఆదాయం కావాలని ఉంటుంది. కానీ, మార్గమేంటో పాలుపోదు. అయితే, నిజంగా అద్దెఆదాయం పెంచుకోవాలని అభిలషించే వారి ముందు నేడు పలు మార్గాలున్నాయి.
వీటి గురించితెలియజేసేకథనమేఇది.
దేశీయ రెసిడెన్షియల్ భవనాల మార్కెట్‌లో అద్దె రాబడులు అన్నవి ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ అద్దె రాబడి సగటున 2–3 శాతంగా ఉంది. అంటే రూ.50 లక్షల విలువ కలిగిన ఇంటిపై వచ్చే అద్దె ఆదాయం మహా అయితే రూ.9,000–12,000 మధ్య ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో కోలివింగ్, పర్యాటకులకు అద్దెకు ఇవ్వడం అనే కొత్త నమూనాలు పుట్టుకొచ్చాయి. వీటిని ఆశ్రయించడం వల్ల యజమానులకు కాస్త అధిక రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంది. ‘‘నూతన నమూనాల్లో ముఖ్యంగా కోలివింగ్ రూపంలో అద్దె రాబడి 8 శాతం (ఇంటి విలువపై) వరకు వచ్చే అవకాశం ఉంది. నేరుగా అద్దెకు ఇవ్వడం వల్ల వచ్చే 3 శాతం కంటే ఎంతో ఎక్కువ’’ అని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్‌పాయ్ పేర్కొన్నారు. మరింత అద్దె ఆదాయం కోరుకునే వారికి ఈ నమూనాలు ఉపకరిస్తాయి. అయితే, ఈ రెండు నమూనాల్లోనూ వాటికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీటి ద్వారా ఇళ్ల యజమానులు అందరూ అధిక ఆదాయం తెచ్చుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పలేం. ఎందుకంటే పర్యాటకులకు అద్దెకు ఇచ్చే నమూనా కింద అధిక ఆదాయం కోరుకునే వారు... వారి ఇల్లు ఏ ప్రాంతంలో ఉన్నదీ కీలక పాత్ర పోషిస్తుంది. పట్టణానికి మధ్య భాగంలో ఉందా లేక పర్యాటక ప్రదేశాలకు సమీపంలో ఉందా అని చూడాల్సి ఉంటుంది. ‘‘కో లివింగ్ నమూనాలో ఇంటి విస్తీర్ణం పెద్దగా ఉండాలి. మొత్తం ఇంట్లో కనీసం 50–60 గదులు అయినా ఉండాలి’’ అని బెంగళూరుకు చెందిన కోలివ్ సంస్థ సీఈవో సురేష్ రంగరాజ పేర్కొన్నారు.
ఇల్లు ఎక్కడ ఉంది, ఏ తరహా
ప్రాపర్టీ అనే అంశాల ఆధారంగా ఇంటి యజమాని కోలివింగ్, పర్యాటకులకు అద్దెకు ఇవ్వడంలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అలాగే, రోజువారీ కార్యకలాపాల్లో తమ పాత్ర, పెట్టుబడి వంటి అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
50 శాతం అధికంగా...
కో లివింగ్ విధానాన్ని ఎంచుకోవడం ద్వారా ఇంటి యజమాని తన అద్దె ఆదాయాన్ని 50 శాతం, లేదా అంతకుమించి పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ‘‘కో లివింగ్ విభాగంలో కంపెనీలు విడి భవనాలకు ప్రాధాన్యం ఇస్తాయి. ఎందుకుంటే వీటిని తమ అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకోవడం సులభం. ఐటీ పార్క్‌లు, వ్యాపార కేంద్రాలు, కార్యాలయ సముదాయాలకు సమీప ప్రాంతాల్లోని భవనాలకు ఎక్కువ ఆసక్తి చూపుతాయి. రిస్క్ తీసుకోని యజమానులు అయితే కో లివింగ్‌లో స్థిరమైన అద్దె విధానాన్ని ఎంచుకోవచ్చు. రిస్క్ తీసుకునే వారు అధిక ఆదాయం కోసం ఆదాయ పంపిణీ (వచ్చిన ఆదాయంలో కంపెనీకి, యజమానికి ఇంతని వాటా)విధానాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఇంటి యజమానులతో కో లివింగ్ ప్లాట్‌ఫామ్‌లు 10 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటుంటాయి. నిర్వహణ, పోలీసుల ద్రువీకరణ, అద్దెకు ఉండే వారితో లావాదేవీల వ్యవహారాలన్నీ కంపెనీలే చూసుకుంటాయి. ఇంటి యజమానిపై ప్రత్యేక బాధ్యతలు ఏమీ ఉండవు.
పర్యాటకులకు అద్దెకిచ్చేట్టు అయితే...
ఎయిర్‌బీఎ బీ, ఓయో ప్లాట్‌ఫామ్‌లు అయితే ఇంటి యజమానులు తమ ప్రాపర్టీలను స్వల్ప కాలం పాటు అద్దెకు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. స్వల్పకాలం పాటు విడిది చేసే పర్యాటకులకు ఈ సంస్థలు.. అద్దెకు ఇచ్చుకునే వేదికగా నిలుస్తున్నాయి. ప్రాంతం లేదా ఇంటి విస్తీర్ణం విషయంలో ఈ విధానంలో నియంత్రణలు ఉండవు. ఒక గదిని కూడా అద్దెకు ఇచ్చుకోవచ్చు. ఎయిర్‌బీఎ¯Œ బీ వంటి సంస్థలు ఆదాయంలో ఇంటి యజమానికి ఎక్కువ వాటా ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. కాకపోతే, ఇంటి యజమాని పాత్ర ఎక్కువ ఉండాలి. తమ ఇంటిని మార్కెటింగ్ చేయడం, సందర్శకుల అవసరాలకు తగినట్టుగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. మీనాక్షి దహియా ఎయిర్‌బీఎ¯Œ బీకి సూపర్ హోస్ట్‌గా ఉన్నారు. ఎక్కువ మంది టాప్ రేటింగ్ ఇవ్వడం వల్ల ఆమెకు ఈ హోదా లభించింది. ఆమెకు మూడు ప్రాంతాల్లోని ఇళ్లలో మొత్తం 55 గదులు ఉన్నాయి. వీటి ద్వారా ఆమె అంతకు ముందుతో పోలిస్తే 140 శాతం అధికంగా ఆదాయం పొందుతున్నట్టు స్వయంగా తెలిపారు. ‘‘ఎయిర్‌బీఎ¯Œ బీలో ప్రొఫైల్ నిర్మించుకునేందుకు సమయం తీసుకుంటుంది. కానీ, సందర్శకులు ఆతిథ్యం ఇచ్చిన వారికి అధిక రేటింగ్ ఇవ్వడం మొదలైతే వ్యాపారం వృద్ధి చెందుతుంది. సందర్శకుల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం ద్వారా నా ఇంటిలో మార్పులు చేస్తుంటాను’’ అని దహియా తెలిపారు. ఎయిర్‌బీఎ¯Œ బీ ప్రతీ బుకింగ్‌పై చెల్లించే మొత్తం నుంచి 3 శాతాన్ని చార్జ్‌గా వసూలు చేస్తోంది.
పేయింగ్ గెస్ట్‌కు అయితే...
రెండు లేదా మూడు పడకల ఇల్లు కలిగిన వారు ఆదాయం పెంచుకునేందుకు వారి ముందున్న మార్గం దాన్ని పేయింగ్ గెస్ట్ అకామడేష¯Œ (పీజీ)గా మార్చుకోవడం. ‘‘3బీహెచ్‌కే ఫ్లాట్‌ను విడిగా ఓ కుటుంబానికి అద్దెకు ఇస్తే మహా అయితే రూ.16,000–17,000కు మించి రాదు. అదే ఆరుగురు వ్యక్తులకు పీజీ కింద ఇస్తే, ఒక్కొక్కరి నుంచి రూ.6,000 చొప్పున రూ.36,000 ఆదాయం వస్తుంది’’ అని చెన్నైకి చెందిన ఉమాసుబ్రమణియం తెలిపారు. అయితే పీజీ కింద మార్చాలనుకుంటే ఇంటి యజమాని కొన్ని చట్టపరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, పీజీలో ఒక ఆక్యుపెన్సీ బయటకు వెళితే, మరొకరు వచ్చే వరకు అంతమేర అద్దె ఆదాయానికి గండి పడుతుంది.
అద్దెకు ఇస్తే...
నేరుగా ఓ కుటుంబానికి అద్దెకివ్వడం ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. కాకపోతే ఆదాయం స్థిరంగా ఉంటుంది. అద్దెకుండే వారిపై యజమానికి పూర్తి నియంత్రణా ఉంటుంది. అయితే, ఇంటికి కొన్ని మార్పులు చేయడం ద్వారా కాస్త అదనపు ఆదాయం తెచ్చుకునే అవకాశం ఉంటుందని నిపుణుల సూచన. ‘‘ఫర్నిషింగ్స్‌పై ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనీసం కప్‌బోర్డులు, మాడ్యులర్ కిచెన్ వంటివి ఏర్పాటు చేసుకోవాలి. కొంచెం అద్దె పెంచి అయినా సరే అడ్వాస డిపాజిట్‌ను తగ్గించుకునేందుకు ముందుకు రావాలి. తక్కువ డిపాజిట్ కారణంగా సులభంగా కిరాయిదారులు ముందుకు వస్తారు’’ అని నోబ్రోకర్ డాట్ కామ్ సీఈవో అమిత్ అగర్వాల్ సూచించారు. ఫర్నిషింగ్స్ సమకూర్చి అద్దెకు ఇవ్వడం వల్ల 25 శాతం వరకూ అదనపు అద్దె లభించవచ్చు. యువ జంటలు, బ్రహ్మచారులు ఇంట్లో ఫర్నిషింగ్స్‌పై ఇన్వెస్ట్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరని, అటువంటి వారికి ఇంటి యజమానులే వాటిని సమకూర్చి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చన్నది సూచన.
Comments
Please login to add a commentAdd a comment