
చైర్మన్‌గిరీ కోసం మిస్త్రీ తప్పుదోవ పట్టించారు
• ఎప్పుడూ అధికారంపైనే దృష్టి
• యాజమాన్య నిర్మాణాన్ని బలహీనపరిచారు
• టాటా సన్స్ ఆరోపణలు
న్యూఢిల్లీ: టాటా–మిస్త్రీల వివాదం మరింత ముదిరింది. సైరస్ మిస్త్రీపై టాటా సన్స్ తాజాగా ఆరోపణలతో విరుచుకుపడింది. మిస్త్రీ టాటా గ్రూపు చైర్మన్‌గా ఎంపికయ్యేందుకు తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. తన హామీలను విస్మరించి, అధికారాలపై దృష్టినంతా కేంద్రీకరించడమే కాకుండా తనకిచ్చిన స్వేచ్ఛతో యాజమాన్య వ్యవస్థను బలహీనపరిచారని పేర్కొంది. సైరస్ మిస్త్రీని బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తొలగించేందుకు టాటా గ్రూపు కంపెనీలు వాటాదారుల సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైర్మన్‌గా మిస్త్రీని తొలగించేందుకు దారి తీసిన వాస్తవాలపై టాటా సన్స్ గ్రూపు కంపెనీల వాటాదారులకు వివరిస్తూ.... వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది.
‘‘2011లో టాటా సన్స్ చైర్మన్‌గా రతన్ టాటా వారసుడి ఎంపిక కోసం ఏర్పాటైన సెలక్షన్ కమిటీని మిస్త్రీ తప్పుదోవ పట్టించారు. టాటా గ్రూపు విషయంలో తన ప్రణాళికల గురించి గొప్ప ప్రకటనలు చేశారు. భిన్న రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న దృష్ట్యా అధికారం, బాధ్యతలను పంపిణీ చేసేలా యాజమాన్య నిర్మాణం ఉండాలని ప్రతిపాదించారు. ఎంపిక కమిటీ సైరస్ మిస్త్రీని చైర్మన్‌గా ఎంచుకునేందుకు ఈ ప్రకటనలు కీలక పాత్ర పోషించాయి. అయితే, నాలుగేళ్లు గడిచినా ఈ యాజమాన్య స్వరూపాలు, ప్రణాళికలు ఏవీ ఫలితాన్నివ్వలేదు. మా అభిప్రాయం ప్రకారం సెలక్షన్ కమిటీని మిస్త్రీ తప్పదోవ పట్టించారు’’ అని టాటా సన్స్ వాటాదారులకు వివరించింది.
మిస్త్రీ గత మూడు నాలుగేళ్ల కాలంలో టాటా గ్రూపు నిర్వహణ కంపెనీల చైర్మన్‌గా అధికారాన్నంతా తన చేతుల్లోనే ఉంచుకునేందుకు దృష్టి పెట్టారని, క్రమంగా టాటా కంపెనీల బోర్డుల్లో టాటా సన్స్ ప్రాతినిధ్యాన్ని తగ్గించారని ఆరోపించింది. హోల్డింగ్ కంపెనీగా టాటా సన్స్ డివిడెండ్ ఆదాయం క్రమంగా తగ్గిపోవడం, సిబ్బంది వ్యయాలు రెట్టింపు కావడంపై టాటా సన్స్ ఆందోళనకు గురైనట్టు వివరించింది. అయినా మిస్త్రీ ఇవేమీ పట్టించుకోలేదని ఆరోపించింది. టాటా సన్స్ మనుగడకే ముప్పు అయిన ఈ పరిణామాలను ఆమోదించలేకపోయినట్టు స్పష్టం చేసింది.
మీ సహకారం కావాలి...
టాటా గ్రూపు కంపెనీల్లో పెద్ద ఎత్తున కార్పొరేట్ నియమ, నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ గ్రూపు కంపెనీల వాటాదారులకు సైరస్ మిస్త్రీ ఇటీవల రాసిన లేఖపైనా టాటా సన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టాటా గ్రూపు 149 ఏళ్ల నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తూ, కార్పొరేట్ పాలన విషయంలో ప్రమాణాలను నెలకొల్పినట్టు పేర్కొంది. గ్రూపు హెడ్‌గా నాలుగేళ్ల పాటు అధికారాన్ని వెలగబెట్టిన మిస్త్రీ కార్పొరేట్ పాలనపై తమకు పాఠాలు చెబుతున్నారంటూ విమర్శించింది. మిస్త్రీ హయాంలో 2015లో ఆయన తీసుకొచ్చిన పరిపాలన మార్గదర్శకాల ప్రకారం టాటా కంపెనీలో తొలగింపునకు గురైన ఉద్యోగి టాటా కంపెనీల బోర్డులకు వెంటనే రాజీనామా చేయాలనే నిబంధన ఉందని తెలిపింది. దీని ప్రకారం ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన మిస్త్రీ గ్రూపు కంపెనీల బోర్డులకు వెంటనే రాజీనామ చేయాలని, ఆ పని చేయకుండా మార్గదర్శకాలను కావాలనే ఉల్లంఘిస్తున్నారని పేర్కొంది.
రతన్‌తో టాటా బ్రాండ్ విలువకు గండి
మిస్త్రీ మండిపాటు
ముంబై: టాటా సన్స్ తనపై చేసిన ఆరోపణలకు సైరస్ మిస్త్రీ ఘాటుగా స్పందించారు. టాటా చైర్మన్‌గా ఎంపికయ్యేందుకు సెలక్షన్ కమిటీని తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలను తోసిపుచ్చుతూ... టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్‌టాటా ప్రవర్తన కారణంగా టాటా బ్రాండ్, విలువలు గణనీయంగా తుడిచిపెట్టుకుపోయాయని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం కాదని... రతన్‌టాటా చివరి ప్రయత్నం చూస్తుంటే ఆయన చర్యల కారణంగా కలిగిన నష్టాల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోందంటూ మిస్త్రీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
అసలు టాటా సన్స్ వద్ద ఏదైనా అంశమే ఉంటే చట్టానికి లోబడి కమిటీ వేసి... మిస్త్రీకి వ్యతిరేకంగా వాటిని తార్కికంగా వెల్లడించాలని సూచించింది. టాటా సన్స్ ప్రకటనలో నోటితో చేసిన సాదాసీదా ఆరోపణలకు మించి ఏమీ లేదని పేర్కొంది. ఎంపిక కమిటీని తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలపై స్పందిస్తూ... సెలక్షన్ కమిటీలో అప్పుడూ, ఇప్పుడూ సభ్యుడిగా ఉన్న టాటాల అత్యంత సన్నిహిత మిత్రుడు లార్డ్ కుమార్ భట్టాచార్య ఆరు నెలల క్రితమే మిస్త్రీ పనితీరుపై సానుకూలంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసింది.