సాక్షి, ముంబై: కరోనా వైరస్ విజృంభణతో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోమవుతోంది. పలు కంపెనీలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఆర్థికమందగమనం, డిమాండ్ క్షీణత నేపథ్యంలో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయిన ఆటో మొబైల్ పరిశ్రమ మరోసారి దిగ్భంధనంలో చిక్కుకుంది. తాజాగా కోవిడ్-19 వ్యాధి విస్తరణ , రక్షణ చర్యల్లో భాగంగా పలు ఆటో కంపెనీలు తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగగా దేశంలో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని దిగ్గజ కంపెనీలు వెల్లడించాయి. వ్యాధి విస్తరణ మరింత ముదరకుండా ముందు జాగ్రత్త చర్యగా కార్యాలయాలకు తాళాలు వేసేసాయి. ముఖ్యంగా అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి కంపెనీలు మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నాయి.
దీంతోపాటు కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించడం విశేషం. స్పోర్ట్-యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా హర్యానాలోని ప్లాంట్ లో ఉత్పత్తిని, కార్యకలాపాలను వెంటనే మూసివేస్తునట్టు తెలిపింది. దీంతోపాటు మహారాష్ట్రలోని ఒక ప్లాంట్‌లో తయారీని నిలిపివేసిందని, సోమవారం నుంచి మరో రెండు ప్లాంట్లను నిలిపివేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే తన ఉత్పాదక కర్మాగారాలలో కరోనావైరస్ రోగులకు వెంటిలేటర్లను తయారు చేయడం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వెంటనే పనులు ప్రారంభిస్తామని గ్రూప్ కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. హాలిడే రిసార్టులను తాత్కాలిక సంరక్షణ సౌకర్యాలుగా మలుస్తామని, అలాంటి కేంద్రాలను నిర్మించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.
దేశంలో అతిపెద్ద ఆటో హబ్‌లలో ఒకటిగా ఉన్న ముంబైలో అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులను నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర, పూణే లలోపి అనేక కార్ల తయారీదారులు ఉత్పత్తిని నిరవధికంగా లేదా మార్చి 31 వరకు నిలిపివేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసాయి. మార్చి 31 వరకు పూణే ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేస్తామని మెర్సిడెస్ బెంజ్, ఫియట్ , బైక్ తయారీదారు బజాజ్ ఆటో ప్రకటించాయి. భారతదేశం, బంగ్లాదేశ్, కొలంబియాలోని అన్ని ప్లాంట్లలో తయారీని నిలిపివేసినట్లు ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఆదివారం తెలిపింది. పూణేలోని తన ప్టాంట్ లో మూడు వారాలపాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని, తమ ఉద్యోగుల భద్రతకు భరోసా ఇస్తున్నట్లు ఫోక్స్ వ్యాగన్ తెలిపింది. మహారాష్ట్రలోని తన కార్ల కర్మాగారంలో కార్యకలాపాలను బాగా తగ్గించామనీ, కరోనావైరస్ గురించి ఆందోళనలు తీవ్రతరం అయితే మూసివేయడానికి సిద్ధమని టాటా మోటార్స్ ఇప్పటికే సంసిద్ధతను వ్యక్తం చేసింది.
మెర్సిడెస్ బెంజ్ , ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ లాంటి కంపెనీలు ప్లాంట్ల మూసివేత నిర్ణయాన్ని ఆదివారం ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిలిపివేస్తున్న గ్లోబల్ దిగ్గజం ఐషర్ మోటార్స్ తెలిపింది. యూరప్, అమెరికా కెనడా , మెక్సికోలలో వాహనదారులు ప్లాంట్లను మూసివేత నిర్ణయాన్ని గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా కరోనావైరస్ కారణంగా ప్రపంచ మరణాల సంఖ్య 14,000 దాటింది. భారతదేశంలో ఇప్పటివరకు సుమారు 400 మందికి ఈ వ్యాధి సోకగా, ఐదుగురు చనిపోయారు. దేశవ్యాప్తంగా రైలు, మెట్రో సేవలు నిలిచిపోయాయి. మార్చి 31 వరకు పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment