రూ.1.75 కోట్లతో.. స్థిరాస్తి ప్రదర్శన!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో భారత డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ ప్రాపర్టీ షో జరగనుంది. ఇందుకు సంబంధించిన తాజా వివరాల్ని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ జైవీర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు.
ఆయనేమన్నారంటే..
సుమారు 150 మంది డెవలపర్లు వంద స్టాళ్లలో 200లకు పైగా ప్రాజెక్ట్‌లను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. వీరితో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నిర్మాణ సామాగ్రి తయారీ సంస్థలు.. ఇలా నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని విభాగాల వారూ ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు.
రూ.1.75 కోట్ల పెట్టుబడితో నిర్వహించే మూడు రోజుల ప్రదర్శనకు సుమారు రూ. 60 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. సందర్శకులకు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక జట్లను ఏర్పాటు చేశాం. నెక్లెస్ రోడ్ అన్ని వర్గాల వారికీ అనుకూలమైన ప్రాంతం కాబట్టే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. ఈ ప్రాంతంలో పార్కింగ్‌కూ ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
ఏటా క్రెడాయ్ ప్రాపర్టీ షోకు రాష్ట్ర ముఖ్యమంత్రే ముఖ్య అతిథిగా హాజరయ్యే వారు. కానీ ఈసారి సీఎం కిరణ్ రాజీనామా చేయడంతో గవర్నర్‌ను అతిథిగా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా ఆయన కూడా వచ్చే అవకాశం దాదాపు కనిపించట్లేదు. మా వంతుగా అయితే ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నాం. ఒకవేళ గవర్నర్ రానిపక్షంలో గృహ నిర్మాణ మంత్రిని ఆహ్వానిస్తాం.
ప్రస్తుతం హైదరాబాద్‌లో 50 వేల ఇళ్లు నిర్మాణ దశలో, సుమారు 5 వేల ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి కాబట్టి నగరవాసులు సొంతింటిని ఎంపిక చేసుకోవడానికి ఇదే సరైన సమయం.
సీమాంధ్ర ప్రాంతంలో రాజధానిని ప్రకటించినప్పటికీ అభివృద్ధి చెందడానికి ఎంతలేదన్నా రెండేళ్ల సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకే పెట్టుబడిదారులు మొగ్గుచూపుతారు. మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్, హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్, ఐటీఐఆర్ ప్రాజెక్ట్.. ఇవన్నీ హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశాలు.