తెలుగు యాప్స్.. భలే క్రేజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాప్స్ యాప్స్ యాప్స్.. ఇప్పుడు ఎవరి నోట విన్నా యాప్స్ గురించే. అంతలా వ్యక్తిగత జీవితంలోనూ యాప్స్ మమేకమయ్యాయి. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని లక్షలాది యాప్ డెవలపర్లు పుట్టుకొస్తున్నారు. డెవలపర్లకు భాష కూడా వ్యాపార వస్తువు కావడంతో ప్రాంతీయ భాషల్లో ‘స్మార్ట్’ యాప్స్ వస్తున్నాయి. పలక, బలపానికి బదులు స్మార్ట్‌ఫోన్‌పైనే అక్షరాలు దిద్దుకునేలా టెక్నాలజీని మార్చేశాయి.
కథలు, సామెతలు, వంటలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు, బైబిల్, ఖురాన్, పొడుపు కథలు, జోక్స్ ఇలా వందలాది తెలుగు యాప్స్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు పుస్తకాల కోసం దుకాణాల చుట్టూ తిరిగే అవసరం లేకుండానే ఎంచక్కా ఒక్క క్లిక్‌తో కళ్ల ముందుకు తీసుకొస్తున్నాయి. యాప్ పాపులర్ అయిందో డెవలపర్‌కు లాభాల పంటే.
సామాన్యుడికీ చేరువ..
ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసేలా స్మార్ట్‌ఫోన్లు రావడంతో డెవలపర్లకు నూతన అవకాశాలు వచ్చిచేరాయి. రూ.2 వేల నుంచే ఆన్‌డ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి. దీంతో సామాన్యుడికీ చేరువ అయ్యేందుకు వీలు కలిగిందంటున్నారు క్రిఫీ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ డెరైక్టర్ కొవ్యూరి కృష్ణారెడ్డి. డెవలపర్లకు మార్కెట్ ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. ఇక పిల్లల విషయానికి వస్తే వారు మొబైల్ ఫోన్‌ను అమితంగా ఇష్టపడతారు. పుస్తకాలకు బదులు స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ ద్వారా అంశాలను నేర్చుకోవడానికి ఉత్సాహం కనబరుస్తారని టెక్నాలజీ కంపెనీ ఏథెనా డోయెన్స్ అంటోంది. తల్లిదండ్రులకు భారం తగ్గుతుందని చెబుతోంది. తెలుగు భాషను ఆధారంగా చేసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంత కాదన్నా 1,500 మంది డెవలపర్లు ఉంటారని సమాచారం.
ఆదాయం కూడా..:
యాప్‌ను ముందు ఉచితంగా ఇచ్చి ఆ తర్వాత పెయిడ్‌గా మారుస్తున్నారు. యాప్‌ను అలవాటు చేసేందుకు కొంత భాగం ఉచితంగా ఇవ్వడం, మిగిలిన భాగానికి చార్జీ (ఇన్-యాప్ పర్చేజ్) చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన కామ్‌ప్రింట్ మూడేళ్లలో 200 తెలుగు యాప్స్‌ను అభివృద్ధి చేసింది. ఏడాదిలో మరో 500 యాప్స్ రూపొందిస్తామని కంపెనీ ఎండీ జి.సత్యనారాయణ చెప్పారు.
యాప్స్ అన్నింటినీ ఉచితంగా అందిస్తున్నట్టు తెలి పారు. యాప్స్‌లో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని గూగుల్ తమకు పంచుతోందని, నెలకు రూ.50 వేలు వస్తున్నాయన్నారు. ‘రూ.2 లక్షల ఖర్చుతో యాప్‌ను రూపొందించాం. కొద్ది రోజుల్లోనే ఆ మొత్తం మా చేతుల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఏటా రూ.2 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాం’ అని ఓ కంపెనీ వ్యవస్థాపకుడు చెప్పారు.
క్రిఫీ రూపొందించిన తెలుగు స్లేట్ యాప్ 15 లక్షలకుపైగా డౌన్‌లోడ్స్ నమోదు చేసింది. ఈ యాప్‌తో తెలుగు అక్షరాలు సుల భంగా నేర్చుకోవచ్చు. తెలుగు రైమ్స్, చిట్టి చిలకమ్మ, చందమామ రావే, చుక్‌చుక్ రైలు తదితర యాప్స్ కామ్‌ప్రింట్‌కు పేరుతెచ్చాయి. 15 లక్షలకుపైగా డౌన్‌లోడ్స్‌ను కామ్‌ప్రింట్ యాప్స్ సొంతం చేసుకున్నాయి.