క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు... వాయిదా రూట్లో వెళితే జాగ్రత్త!!
కిషోర్, సురేష్... ఇద్దరూ మంచి స్నేహితులు. సహోద్యోగులు కూడా. కాకపోతే ఖర్చుల విషయంలో ఇద్దరూ భిన్నధ్రువాలు. కిషోర్ కాస్తంత పొదుపరి. అవసరమైన ఖర్చులు మాత్రమే పెడతాడు. సురేష్ అలాకాదు. ముందూ వెనకా చూడకుండా ఖర్చు చేసేసి... తరవాత తీరిగ్గా బాధపడతాడు. ఇద్దరికీ క్రెడిట్ కార్డులున్నాయి. కార్డు చెల్లింపుల్లోనూ ఇద్దరివీ రెండుదారులు. కిషోర్ ప్రతినెలా తను ఖర్చు చేసిన మొత్తం బిల్లును గడువు తేదీ లోపల ఠంచనుగా చెల్లించేస్తుంటాడు. సురేష్ మాత్రం కాస్త పెద్ద బిల్లుల్ని ఈఎంఐ కింద మార్చేసు కుంటూ ఉంటాడు. ఇలా చేయటం వల్ల కార్డు తీసుకుని రెండేళ్లు తిరిగేసరికి కిషోర్ ఎప్పట్లానే ఉన్నా...
సురేష్‌కు మాత్రం ఈఎంఐ పెరిగి పోయింది. ప్రతినెలా వాడే బిల్లు... దానికితోడు అప్పటికే చెల్లించాల్సిన ఈఎంఐలు... ఇవన్నీ కలిసి భారమయ్యాయి. అసలు సురేష్‌లా చెయ్యటం మంచిదేనా? ఇలా క్రెడిట్ కార్డు బిల్లుల్ని ఈఎంఐలుగా మార్చుకోవటం లాభమా? నష్టమా? వడ్డీ తక్కువే ఉంటుంది కనక లాభమనుకోవచ్చా? ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం...
- సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
చెల్లించ గలిగితే ఒకేసారి చెల్లించటమే బెటర్
# ఆ సామర్థ్యం లేనప్పుడే ఈఎంఐ మార్గం
# ఎంచుకునే ముందు వడ్డీ, గడువు చూడాల్సిందే
# వీలైనంత తక్కువ గడువు ఎంచుకుంటే బెటర్
# గడువు పెరిగే కొద్దీ వడ్డీ కూడా ఎగువ ముఖమే
# ఈఎంఐ అవకాశం కూడా కొందరికే ఇస్తున్న బ్యాంకులు
# దీనిక్కూడా కస్టమర్ల క్రెడిట్ హిస్టరీనే ఆధారం
క్రెడిట్ కార్డు కస్టమర్లు బిల్లు మొత్తం ఒకేసారి కట్టకుండా ఈఎంఐ పద్ధతిలో చెల్లించేలా వారిని ప్రోత్సహించటం బ్యాంకుల వ్యాపారం. కార్డు స్వైప్ చేసిన ప్రతిసారీ... కావాలంటే ఈ బిల్లును మీరు ఈఎంఐలోకి మార్చుకోవచ్చని సూచిస్తూ కస్టమర్లకు ఓ ఎస్‌ఎంఎస్ రావటం అందరికీ తెలిసిందే. కాకపోతే మరీ చిన్నచిన్న బిల్లుల్ని కాకుండా... కాస్త పెద్ద మొత్తంలో బిల్లులకే బ్యాంకులు ఈ ఆఫర్ ఇస్తుంటాయి. ఈ మొత్తం బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ఈ మధ్య పలు బ్యాంకులు ఈ మొత్తాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఎస్‌బీఐ ప్రస్తుతం రూ.2,500 బిల్లును కూడా ఈఎంఐకి మార్చుకునే అవకాశమిస్తోంది.
ఒకరకంగా ఇది కస్టమర్లకు, బ్యాంకులకు ఇద్దరికీ మంచిదే. గడువు తేదీలోపు మొత్తం బిల్లు కట్టలేని కస్టమర్లకు ఇలా మార్చుకోవటం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంకులకు కూడా డిఫాల్ట్‌లు తగ్గి అదనపు వడ్డీ వస్తుంటుంది. కాకపోతే ఈ అవకాశాన్ని ఆచితూచి వాడుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘బిల్లును ఒకేసారి కట్టలేని సందర్భాల్లో మాత్రమే ఈఎంఐ ఎంచుకోవాలి. లేకపోతే ఇది భారంగా మారుతుంది’’ అనేది వారి సూచన.
ఈ రెండూ గుర్తుంచుకోండి...
‘‘ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునేటపుడు ప్రధానంగా ఎన్ని నెలల్లో చెల్లించాలి? వడ్డీ రేటెంత? అనే రెండు అంశాలూ తెలుసుకోవాలి. ఎందుకంటే వడ్డీ రేటు స్థిరంగా ఉండేది కాదు. కస్టమర్‌ను బట్టి, బ్యాంకును బట్టి మారుతుంటుంది. ఒకే కస్టమర్‌కు ఒకోసారి 14 శాతం వడ్డీకే ఈఎంఐ మార్గాన్ని ఎంచుకోవటానికి ఛాన్సిచ్చే బ్యాంకులు... ఒకోసారి అంతకన్నా ఎక్కువ వడ్డీరేటు వేస్తుంటాయి. అందుకని చూసి ఎంచుకోవాలి’’ అని ఎస్‌బీఐ కార్డ్స్ సీఈఓ విజయ్ జసుజ చెప్పారు.
చెల్లించని మొత్తంపై వడ్డీ మిగులుతుంది...
మామూలుగా కూడా క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. కనీస బిల్లుగా పేర్కొనే మొత్తాన్ని చెల్లిస్తే చాలు. ఇది సహజంగా వాడినదాంట్లో 5 శాతంగా ఉంటుంది. కాకపోతే మిగిలిపోయే మొత్తంపై 30-40 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈఎంఐ మార్గాన్ని ఎంచుకుంటే... వడ్డీ రేటు పర్సనల్ లోన్ కన్నా కాస్త ఎక్కువ ఉంటుంది. ఈ లెక్కన చూస్తే వడ్డీ మిగులుతున్నట్టే కదా!!. పెపైచ్చు పర్సనల్ లోన్ మాదిరి డాక్యుమెంట్లు సమర్పించటం వంటి తతంగం ఉండదు.
వడ్డీ రేటెంత?
మామూలుగా ఈఎంఐ మొత్తంపై 12-20 శాతం వరకూ వడ్డీ ఉంటుంది. చెల్లించాల్సిన గడువు కూడా మూడు నెలల నుంచి కొన్ని సందర్భాల్లో మూడేళ్ల వరకూ కూడా ఉంటుంది. అయితే ఎక్కువ కాలం ఎంచుకుంటే ఎక్కువ వడ్డీ పడుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. మీ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి... సాధ్యమైనంత వరకు తక్కువ గడువును ఎంచుకుంటే మంచిదన్నది నిపుణుల సూచన. ఈఎంఐ మార్గం వల్ల మరో ప్రయోజనమేంటంటే డీల్స్, ప్రమోషన్ల ఖర్చును ఆయా వస్తువుల తయారీ కంపెనీలు భరిస్తాయి. దీంతో వడ్డీ మరికాస్త తగ్గుతుంది.
ఈఎంఐ పనిచేసేదిలా...
ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.50వేలు. మీరు ఓ నెలలో ఒకే లావాదేవీలో రూ.15వేల బిల్లు చేశారు. దాన్ని మీరు వడ్డీతో కలిపి ఆరు నెలల పాటు నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాలనుకున్నారు. తదుపరి బిల్లింగ్ గడువు వచ్చేసరికి మీ క్రెడిట్ లిమిట్ రూ.35వేలే ఉంటుంది. కాకపోతే ఒక వాయిదా చెల్లించాక దాన్లో వడ్డీపోను అసలుగా ఎంత చెల్లించారో అది మీ లిమిట్‌కు కలుస్తుంది. ఆ తరవాత మీ లావాదేవీల బిల్లు ఎప్పటికప్పుడు కట్టాల్సిందే.
క్రెడిట్ లిమిట్ దాటడానికి కూడా వీలుండదు. ఒకవేళ దాటితే లావాదేవీ చెల్లకపోవచ్చు. కొన్ని బ్యాంకులు ఒకోసారి అనుమతిస్తాయి కానీ... ఓవర్ లిమిట్ ఛార్జీలు బాగానే వడ్డిస్తాయి. నిజానికి ఈఎంఐ ఆప్షన్ అన్ని బ్యాంకుల దగ్గరా ఉంటుంది. కాకపోతే అందరు కస్టమర్లకూ ఇవ్వరు. వారి క్రెడిట్ హిస్టరీ చూసి... కస్టమర్‌ను బట్టి బ్యాంకులు ఈ ఆఫర్ ఇస్తుంటాయి. ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని కూడా గడువులోపు చెల్లించకపోతే మామూలుగా కార్డుపై వడ్డీ రేట్లెంత ఉంటాయో అవే వర్తిస్తాయి. అదనంగా రీపేమెంట్ ఫెయిల్యూర్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.