ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేస్తే.. రాయి రావడం. బట్టలు ఆర్డర్ చేస్తే మరేదో రావడం. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా మహారాష్ట్రకు చెందిన రాకేష్ ఛాబరియా, అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. దాని కోసం రూ.33వేలు కూడా చెల్లించాడు. కానీ ఆర్డర్ తన చేతిలోకి వచ్చాక కానీ తెలియలేదు. తనకి ఓ పెద్ద రాయి వచ్చిందని. అంటే రాకేష్‌కు స్మార్ట్‌ఫోన్ బదులు ఓ పెద్ద రాయి డెలివరీ అయింది. డెలివరీ బాయ్ తీసుకొచ్చిన పార్శిల్ కాస్త భిన్నంగా కనిపించడంతో, రాకేష్‌కు అనుమానం వచ్చింది. డెలివరీ బాయ్‌నే రాకేష్ బాక్స్‌ను తెరమన్నాడు. ఈ బాక్స్‌లో ఉన్న రాయిని చూసి ఇద్దరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బాక్స్ నుంచి ఫోన్ ఎలా మిస్ అయిందని డెలివరీ బాయ్‌ను అడగగా.. తనకేమీ తెలియదంటూ సమాధానమిచ్చాడు.
వెంటనే వీటి ఫోటోలను తీసిన రాకేష్, అమెజాన్‌కు ఈ-మెయిల్ పంపాడు. రాకేష్‌కు క్షమాపణ చెప్పిన అమెజాన్, తదుపరి విచారణ కోసం ఆధార్ కార్డు వివరాలు పంపమని కోరింది. వచ్చే 3-4 రోజుల్లో ఈ విషయాన్ని పరిష్కరిస్తామని చెప్పింది. అయితే ఐదు రోజులు గడుస్తున్నా.. రాకేష్‌కు అమెజాన్ నుంచి కనీస స్పందన లేదు. ఓ ఆంగ్ల వార్త గ్రూప్ అమెజాన్‌ను సంప్రదించగా.. కస్టమర్లందరికీ తాము జాగ్రత్తగా డెలివరీ చేపట్టాలని అంకితభావంతో పనిచేస్తున్నామని, ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే పరిష్కరిస్తామంటూ చెప్పుకొచ్చింది. రూ.33వేలు చెల్లించినప్పటికీ, తన చేతిలోకి ఇంకా కొత్త ఫోన్ రాకపోవడంపై రాకేష్ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment