ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో మొబైల్ ఫోన్ కానీ, ల్యాప్‌టాప్ కానీ లేదా ఇతర ఏదైనా ఖరీదైన వస్తువు కొంటున్నారా? అయితే ఇక నుంచి డెలివరీని ధృవీకరించడానికి ఆరు అంకెల ఓటీపీ అవసరమట. మరింత సురక్షితమైన షాపింగ్ అనుభవాన్ని అందించడం కోసం అత్యంత విలువైన ఆర్డర్లకు వన్ టైమ్ పాస్‌వర్డ్(ఎటీపీ)ని ఇవ్వడం ప్రారంభించింది అమెజాన్ ఇండియా. ఈ ఓటీపీని డెలివరీ ఏజెంట్లు డివైజ్‌లో నమోదుచేసి, డెలివరీని ధృవీకరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కేటగిరీల్లో ఎక్కువ విలువున్న ఉత్పత్తుల కోసం ఈ కొత్త ఓటీపీ ఫీచర్‌ను అమెజాన్ ఇండియా తీసుకొచ్చింది. ఆర్డర్‌ను ధృవీకరించడానికి అమెజాన్ ఇండియానే ఆరు అంకెల ఓటీపీని మెసేజ్ రూపంలో అందిస్తోంది. ఈ ఓటీపీని డెలివరీ ఏజెంట్ల డివైజ్‌లో కస్టమర్లు నమోదు చేసి, తమ ప్రొడక్ట్‌ను తీసుకోవాలి. ఈ విషయాన్ని అమెజాన్ అధికార ప్రతినిధి గాడ్జెట్స్ 360కి ధృవీకరించారు.
‘కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అయిన అమెజాన్, కస్టమర్లందరికీ సురక్షితంగా డెలివరీని అందజేసేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొన్ని ఆర్డర్లకు ప్రస్తుతం ఓటీపీ ఆధారిత డెలివరీ మెకానిజం తీసుకొచ్చాం. కస్టమర్ రిజిస్ట్రర్ చేసిన మొబైల్ నెంబర్‌కు లేదా ఈమెయిల్ అడ్రస్‌కు ఈ ఓటీపీ పంపుతాం. దీన్ని డెలివరీని అంగీకరించినట్టు తెలుసుకునేందుకు వాడుతున్నాం’ అని అధికార ప్రతినిధి చెప్పారు. ఈ నెల మొదట్లోనే అమెజాన్ ఇండియా తన ఐదో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా డిజిటల్ పేమెంట్ ద్వారా తమ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లో వెయ్యి రూపాయలకు మించి కొనుగోలు చేసిన వారికి 250 రూపాయల క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. గత రెండేళ్ల కాలంలో భారత్‌లో ఎక్కువగా సందర్శించిన సైట్‌ల్లో అమెజాన్.ఇన్‌ను నిలిపినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని అమెజాన్ ఇండియా సైట్‌లో సీఈవో జెఫ్ బెజోస్ లేఖ పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment