సైయంట్ లాభం రూ. 97 కోట్లు
రూ. 3 మధ్యంతర డివిడెండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 97 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ఆర్జించింది. క్రితం క్యూ2లో లాభం రూ. 99 కోట్లతో పోలిస్తే కొంత క్షీణించగా.. అయితే, సీక్వెన్షియల్ ప్రాతిపదికన మాత్రం రూ. 74 కోట్ల నుంచి దాదాపు 31 శాతం వృద్ధి కనపర్చింది. మరోవైపు ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ2లోని రూ. 772 కోట్ల నుంచి దాదాపు 18 శాతం వృద్ధితో రూ. 914 కోట్లకు పెరిగింది. విదేశీ మారక విలువ హెచ్చుతగ్గులు, రజతోత్సవ వ్యయాలు మొదలైన సవాళ్లు ఎదురైనప్పటికీ .. మెరుగ్గా ఫలితాలు సాధించగలిగినట్లు సంస్థ వెల్లడించింది.
రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై కంపెనీ రూ. 3 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రజతోత్సవం సందర్భంగా ఇప్పటికే ప్రకటించిన 50 శాతం ప్రత్యేక డివిడెండ్‌కు ఇది అదనమని వివరించింది. అక్టోబర్ 25 రికార్డు తేదీ కాగా, చెల్లింపు తేది నవంబర్ 3. గత రెండో క్యూ2లో, తాజా క్యూ1లో రెండు కంపెనీల కొనుగోలు కారణంగా.. ఆర్థిక ఫలితాలు పోల్చి చూడరాదని కంపెనీ పేర్కొంది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) క్యూ1లో 21.5 శాతం, క్యూ2లో 22.7 శాతం మేర ఊహించిన దానికన్నా అధికంగా నమోదైంది. అయితే, క్యూ4 నాటికి దీన్ని 17-18 శాతానికి తగ్గించే దిశగా పనిచేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
క్యూ2లో 23 కొత్త క్లయింట్లు..
కమ్యూనికేషన్ 24 శాతం, యుటిలిటీస్ 14 శాతం, మెడికల్ .. హెల్త్‌కేర్ విభాగం 7 శాతం మేర వృద్ధి చెందినట్లు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు. గత త్రైమాసికంలో ప్రారంభించిన ప్రాగ్ ఇంజనీర్ సెంటర్ కూడా ఆదాయాల పెరుగుదలకు తోడ్పడినట్లు చెప్పారు. క్యూ2లో కొత్తగా 23 కస్టమర్లు జతయినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో సర్వీసెస్ విభాగం రెండంకెల స్థాయిలో, డీఎల్‌ఎం (డిజైన్ ఆధారిత తయారీ) వ్యాపార విభాగం 50 శాతం మేర వృద్ధి కనపర్చగలదని అంచనా వేస్తున్నట్లు కృష్ణ చెప్పారు. నిర్వహణ మార్జిన్లు ఒక మోస్తరు స్థాయిలో పెరిగి రెండంకెల స్థాయి వృద్ధికి దోహదపడగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో గురువారం సైయంట్ షేరు బీఎస్‌ఈలో 11.52% ఎగిసి రూ. 538.80 వద్ద ముగిసింది.