మిస్త్రీకి టీసీఎస్‌ టాటా.. | Cyrus Mistry removed as director of TCS with 93.11% shareholders voting for his ouster | Sakshi
Sakshi News home page

మిస్త్రీకి టీసీఎస్‌ టాటా..

Published Wed, Dec 14 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

మిస్త్రీకి టీసీఎస్‌ టాటా..

మిస్త్రీకి టీసీఎస్‌ టాటా..

బోర్డు నుంచి ఉద్వాసనకు ఈజీఎంలో  మెజారిటీ ఓటింగ్‌
మిస్త్రీకి బాసటగా కొందరు షేర్‌హోల్డర్లు


ముంబై: టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీని మిగతా గ్రూప్‌ సంస్థల బోర్డుల నుంచి కూడా సాగనంపే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.  మంగళవారం జరిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) అసాధారణ సర్వ సభ్య సమావేశంలో (ఈజీఎం) సంస్థ డైరెక్టరుగా ఆయన్ను తొలగించే ప్రతిపాదనకు మెజారిటీ షేర్‌హోల్డర్లు అనుకూలంగా ఓటేశారు. మిస్త్రీ తొలగింపుపై మొత్తం 86.71 శాతం వాటాలున్న షేర్‌హోల్డర్లు ఓటింగ్‌ వేయగా.. 93.11 శాతం మంది అనుకూలంగా, 6.89 వ్యతిరేకంగాను ఓటు వేశారు. రిటైల్‌ ఇన్వెస్టర్లలో మాత్రం 78 శాతం మంది మిస్త్రీ తొలగింపును వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. సైరస్‌ మిస్త్రీ ఈ సమావేశానికి హాజరు కాలేదు.

తాత్కాలిక చైర్మన్‌ రతన్‌ టాటా మాత్రం ఈజీఎం ఆసాంతం ఉన్నారు. టీసీఎస్‌ మధ్యంతర చైర్మన్‌ ఇషాత్‌ హుస్సేన్‌ ఈజీఎంకి సారథ్యం వహించకుండా పక్కకు తప్పుకోవడంతో ఆయన స్థానంలో స్వతంత్ర డైరెక్టర్‌ అమన్‌ మెహతా..సమావేశాన్ని నిర్వహించారు. మిస్త్రీ తొలగింపు అంశం కేవలం పని తీరుకు మాత్రమే సంబంధించినది కాదని.. ప్రమోటర్‌ గ్రూప్‌ టాటా సన్స్, టాటా ట్రస్ట్స్‌ విశ్వాసాన్ని కోల్పోయినందుకే ఆ యన్ను తొలగించినట్లు మెహతా చెప్పారు. ఈ పరిస్థితుల్లో టీసీఎస్‌ బోర్డు నుంచి ఆయన తనంత తానుగా తప్పుకోవడమే కంపెనీకి శ్రేయస్కరమని మెహతా పేర్కొన్నారు.

కారణాలు చెప్పాలన్న అదిల్‌ ఇరానీ
టీసీఎస్‌లో టాటా సన్స్‌కి మెజారిటీ వాటాలు ఉన్నందున ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది అంతా ముందుగానే ఊహించినదే అయినా .. సమావేశంలో కొంత మంది షేర్‌హోల్డర్లు మిస్త్రీకి మద్దతుగా మాట్లాడటం గమనార్హం. దాదాపు 150 నిమిషాల పాటు సాగిన ఈజీఎంలో 38 మంది షేర్‌హోల్డర్లు మాట్లాడారు. వీరిలో చాలా మంది టాటాకే మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ.. మిస్త్రీకి మద్దతుగా మాట్లాడిన వారికీ అభినందనలు దక్కాయి. అసలు మిస్త్రీని తొలగించడానికి సరైన కారణాలేమిటో చెప్పాలంటూ అదిల్‌ ఇరానీ తదితర షేర్‌హోల్డర్లు నిగ్గదీశారు. ’మీ డ్రైవర్‌నో, ఆఫీస్‌ బాయ్‌నో ఈ విధంగా తీసేస్తారా.. అలాంటిది మా చైర్మన్‌ను ఎందుకు తీసేశారు.

సరైన కారణాలు చెప్పాలి’ అంటూ డిమాండ్‌ చేశారు. సమావేశంలో కొన్ని నాటకీయ పరిణామాలూ చోటు చేసుకున్నాయి. రతన్‌ టాటా ఆశయాల కోసం తాము ప్రాణత్యాగానికి కూడా సిద్ధమంటూ ఇద్దరు షేర్‌హోల్డర్లు పేర్కొన్నారు. టాటా గ్రూప్‌నకు ’టాటా’ వారసులే సారథ్యం వహించాలని కొందరు అభిప్రాయపడ్డారు. టాటా–మిస్త్రీ మధ్య పోరుతో 149 ఏళ్ల చరిత్ర గల గ్రూప్‌ ప్రతిష్ట మసకబారుతోందని మరో షేర్‌హోల్డరు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారం కోసం పాకులాడటం లేదు: మిస్త్రీ
టాటా ఇండస్ట్రీస్‌ బోర్డు నుంచి కూడా ఉద్వాసనకు గురైన మిస్త్రీ.. తాజాగా ఓటింగ్‌ సందర్భంగా టీసీఎస్‌ షేర్‌హోల్డర్లకు మిస్త్రీ లేఖ రాశారు. తాను అధికారం కోసం తాను పాకులాడటం లేదని, టాటా గ్రూప్‌ విలువలను కాపాడేందుకే పోరాడుతున్నానని ఆయన తెలిపారు.  టీసీఎస్‌ బోర్డు నుంచి తనను తొలగించే ప్రతిపాదనకు సంబంధించి మనస్సాక్షికి అనుగుణంగా ఓటెయ్యాలని కోరారు. గడిచిన కొన్ని వారాలుగా గ్రూప్‌లో గుడ్‌ గవర్నెన్స్‌ను గాలికొదిలేశారని, ఇష్టారీతిగా వ్యవహరించడం.. వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం జరుగుతోందని మిస్త్రీ ఆరోపించారు. టాటా గ్రూప్‌ చైర్మన్‌గా మిస్త్రీని తొలగిస్తున్నట్లు అక్టోబర్‌ 24న టాటా సన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే, పలు గ్రూప్‌ సంస్థల బోర్డుల్లోని డైరెక్టర్‌ హోదా నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడానికి మిస్త్రీ నిరాకరించడంతో ఆయన్ను తప్పించే అంశంపై ఏడు గ్రూప్‌ సంస్థలు డిసెంబర్‌లో ఈజీఎంలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే టీసీఎస్‌ ఈజీఎం జరిగింది. దీని ఫలితాలు ఇతర గ్రూప్‌ కంపెనీల ఈజీఎంల మీద ప్రభావం చూపనుండటంతో ఈ పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీసీఎస్‌లో ప్రమోటర్లకు మెజారిటీ హోల్డింగ్స్‌ ఉన్నప్పటికీ.. ఈజీఎంలు నిర్వహించనున్న కొన్ని సంస్థల్లో కేవలం 28% వాటాలే ఉన్నాయి. దీంతో సంస్థాగత షేర్‌హోల్డర్లు ఎటు మొగ్గు చూపుతారన్నది కీలకంగా మారింది. టీసీఎస్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు 17.02%, బీమా కంపెనీలకు 4.1%, మ్యూచువల్‌ ఫండ్స్‌.. దేశీ ఆర్థిక సంస్థలు.. బ్యాంకులకు 1.03% వాటాలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement