దీర్ఘకాలంలో నోట్ల రద్దు ప్రయోజనాలు
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డీ సుబ్బారావు ఆశాభావం
కోల్‌కతా: పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ఫలితాలు గడచిన ఎనిమిది నెలలుగా స్పష్టంగా కనిపించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు బుధవారం పేర్కొన్నారు. అయితే డీమోనిటైజేషన్ ప్రయోజనాలు దీర్ఘకాలంలో కనిపిస్తాయన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. బంధన్ బ్యాంక్ రెండవ వ్యవస్థాపక వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. క్లుప్తంగా ఆయన వ్యాఖ్యల్ని చూస్తే....
డీమోనిటైజేషన్ వల్ల వేలాది ఉద్యోగాలు పోయాయ్. రోగులకు తగిన వైద్యం అందలేదు. ప్రజలు గంటలకొద్దీ వరుసలో నిలుచున్నారు. ఎంతో వేదన కలిగింది. వీటన్నింటి ప్రతికూలత మనకు గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ వృద్ధి రేటు (6.1 శాతం) రూపంలో కనబడింది.
ఇంకా నిర్వహించాల్సిన లక్ష్యాల ఆధారంగా ప్రయోజనాలు ఉంటాయి. నల్లధనం తదుపరి సృష్టి జరక్కుండా చర్యలు, ఆర్థికలావాదేవీల డిజిటలైజేషన్, నకిలీనోట్లను రూపుమాపడం... ఇవన్నీ నిర్దేశిత లక్ష్యాల్లో కీలకమైనవి.
డిజిటలైజేషన్ వైపు నడకకూ–డీమోనిటైజేషన్‌కు సంబంధం లేదు. డీమోనిటైజేషన్ అవసరం లేకుండానే డిజిటలైజేషన్ చర్యలు పటిష్టంగా చేపట్టవచ్చు.
స్థూల దేశీయోత్పత్తిలో ఆదాపు పన్ను వాటా మరింత పెరగాలి.
ఆర్థిక రికవరీ ఆందోళనే: డీఅండ్‌బీ
భారత్ ఆర్థిక రికవరీ ఇంకా ఆందోళనకరంగానే ఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) తన తాజా నివేదికలో పేర్కొంది. వినియోగం, పెట్టుబడుల డిమాండ్ ఇంకా మందకొడిగానే ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. బ్యాంకుల మొండిబకాయిల సమస్య, కంపెనీల బ్యాలెన్స్ షీట్స్ బలహీనత, వ్యవసాయ రుణ మాఫీ తద్వారా ద్రవ్య క్రమశిక్షణకు విఘాతం వంటి ప్రతికూల అంశాలను అమెరికాకు చెందిన ఈ వ్యాపార సేవల కంపెనీ ఉదహరించింది.