సాక్షి, ముంబయి : రూ లక్షల కోట్ల మొండి బాకీలతో సతమతమవుతున్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అమెరికా తరహాలో ఆన్‌లైన్ ట్రేడింగ్ వేదికను ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ సూచించింది. ఆన్‌లైన్‌లో మొండి బాకీలను విక్రయించే వ్యవస్థ ఏర్పాటుకు పూనుకోవాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ వైరల్ ఆచార్య పేర్కొన్నారు. అమెరికా, దక్షిణ కొరియాలో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తినప్పుడు ఇలాంటి వ్యవస్థ ఏర్పాటై ఆ తర్వాత రుణ విక్రయాల్లో పరిశ్రమ ప్రమాణాలతో పనిచేస్తోందని గుర్తుచేశారు. ఇక 2017, సెప్టెంబర్ నాటికి బ్యాంకుల రాని బాకీలు మొత్తం రూ 10 లక్షల కోట్లకు చేరిన విషయం తెలిసిందే.
మొండి బాకీలు పేరుకుపోతున్న క్రమంలో గత జూన్ నుంచి ఆర్‌బీఐ 40 అతిపెద్ద మొండి బకాయిదారులను గుర్తించి వారిని డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌కు నివేదించాలని బ్యాంకులకు సూచించింది. పది లక్షల కోట్ల మొండి బాకీల్లో ఈ 40 ఖాతాలే రూ 4 లక్షల కోట్ల వరకూ ఉన్నాయి. మొండి బకాయిల జాబితాలో ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, భూషణ్ పవర్, అమ్టెక్ ఆటో, వీడియోకాన్ ఇండస్ర్టీస్, జేపీ ఇన్‌ఫ్రా వంటి కంపెనీలున్నాయి. ఇక బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి 10.8 శాతానికి, సెప్టెంబర్‌లో 11 శాతానికి పెరుగుతాయని ఆర్‌బీఐ ఇటీవల వెల్లడించిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment