ముంబై: భారీ మొండి బకాయి ఖాతాల (ఎన్‌పీఏలు) విషయంలో ఆర్‌బీఐ విధించిన ఆరు నెలల గడువు సోమవారంతో ముగిసిపోనుంది. సుమారు 70 ఖాతాలకు సంబంధించి రూ.3.8 లక్షల కోట్ల రుణాలకు బ్యాంకులు పరిష్కార ప్రణాళిక సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే వాటిని ఎన్‌సీఎల్‌టీ పరిష్కారానికి నివేదించక తప్పనిసరి పరిస్థితిని బ్యాంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులు చివరి క్షణంలో వీటికి సంబంధించి పరిష్కారం కోసం తమ చర్యల్ని వేగవంతం చేశాయి.
ఈ ఖాతాల్లో ఎక్కువగా విద్యుత్ కంపెనీలవి కాగా, ఈపీసీ, టెలికం కంపెనీలవీ ఉండటం గమనార్హం. అయితే, ఎన్‌సీఎల్‌టీకి నివేదించే విషయంలో బ్యాంకులు సుముఖంగా లేవు. ఎందుకంటే ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీకి సిఫారసు చేసిన ఖాతాల విషయంలో బ్యాంకులు ఎక్కువ హేర్‌కట్ (ఒక రుణంపై నష్టం) ఎదుర్కోవాల్సి వచ్చింది. అలోక్ ఇండస్ట్రీస్ ఎన్‌పీఏ ఖాతాలో ఈ హేర్‌కట్ 86 శాతంగా ఉండటం గమనార్హం. అంటే బ్యాంకులు తామిచ్చిన రుణంలో 86 శాతాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి.
రుణ గ్రహీతలు చెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యమైనా ఆయా ఖాతాలను ఎన్‌పీఏలుగా గుర్తించి, నాటి నుంచి 180 రోజుల్లోపు (ఆరు నెలలు) పరిష్కారాన్ని కనుగొనాలన్నది ఆర్‌బీఐ ఆదేశాల సారం. ఈ ఆదేశాలు ఈ ఏడాది మార్చి 1 నుంచి అమల్లోకి రాగా, నాటికి ఎన్‌పీఏలుగా ఉన్న ఖాతాలకు గడువు ఆగస్ట్ 27తో తీరిపోనుంది. సోమవారం నాటికి పరిష్కారం లభించకపోతే ఎన్‌సీఎల్‌టీ ముందు నమోదుచేసి, దివాలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. చివరి క్షణంలోపు అవకాశం ఉన్నంత మేరకు పరిష్కారానికి బ్యాంకులు ప్రయత్నాలు చేస్తున్నాయి.
అలహాబాద్ హైకోర్టులో విచారణ పెండింగ్
రూ.3.8 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో మూడో వంతు విద్యుత్ కంపెనీలవి కాగా, ఇవి ఇప్పటికే ఆర్‌బీఐ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. కాగా, కొన్ని బ్యాంకులు పరిష్కార ప్రణాళికను రూపొందించగా, మరికొన్ని ఇదే పనిలో ఉన్నట్టు ఓ ప్రభుత్వరంగ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. చాలా వరకు బ్యాంకులు పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపేందుకు లేదా డిఫాల్టింగ్ కంపెనీలకు రుణ సదుపాయం ఇచ్చేందుకు గాను సోమవారం బోర్డు సమావేశాలు ఏర్పాటు చేశాయని చెప్పారు. అయితే, రూ.3.5 లక్షల కోట్లు విలువైన సుమారు 60 ఎన్‌పీఏ ఖాతాలను ఎన్‌సీఎల్‌టీకి నివేదించే అవకాశం ఉందన్న సమాచారం వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment