బడా ఎగవేతదారులతోనే దెబ్బ!
ఆనంద్(గుజరాత్): బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడానికి బడా రుణ ఎగవేతదారులే కారణమని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ‘కొంత మంది పెద్ద రుణ గ్రహీతల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిలు భారీగా ఎగబాకి నష్టాలపాలవుతున్నాయి. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలన్న బాధ్యతలేకుండా రిస్క్‌లేని పెట్టుబడిదారీ విధానంతో ఈ బడా రుణ గ్రహీతలు ఒకరకంగా జల్సా చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు, నిజాయితీగా రుణాలను చెల్లించేవాళ్లు దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తోంది.
ఒక పెద్ద రుణ గ్రహీత మొండిబకాయిదారునిగా మారితే.. పరిశ్రమ దిగ్గజం కాబట్టి వెసులుబాటు ఇవ్వడం కుదరదు. దేశ ప్రజల కష్టార్జితాన్ని అనుభవిస్తున్న పరాన్నభుక్తులుగా వీళ్లను పేర్కొనవచ్చు’ అని రాజన్ పేర్కొన్నారు. మంగళవారమిక్కడ డాక్టర్ వర్ఘీస్ కురియన్ మూడో మెమోరియల్ లెక్చర్ కార్యక్రమంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్రమైన మొండిబకాయిల సమస్యలను ఎదుర్కొంటుండటం... అదికూడా కొన్ని బడా కార్పొరేట్లకు ఇచ్చిన రుణా ల రికవరీ జటిలంగా మారుతున్న నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘నేను రిస్క్ తీసుకోవడానికి వ్యతిరేకం కాదు. కొంత మంది ప్రమోటర్లు తమ వ్యాపారాలు నిలదొక్కుకోవాలంటే కొన్ని ప్రోత్సాహకాలు కల్పించాలంటూ బ్యాంకులు, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వాలను బెదిరిస్తున్న సందర్భాలూ ఉన్నాయి.
అయితే, దురదృష్టవశాత్తూ మన రుణ వ్యవస్థ దుర్భరంగా ఉంది. ఇటీవల కొన్నేళ్లుగా తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులు సజావుగా జరగడం లేదు. ఈ ఇబ్బందులకు పెద్ద రుణ గ్రహీతలే కారణం. చిన్న రుణ గ్రహీతల వల్ల ఎలాంటి సమస్యాలేదు. అని కూడా రాజన్ అన్నారు. ఇవే అభిప్రాయాలతో గతంలో రాజన్ ‘సేవింగ్ క్యాపిటలిజం ఫ్రమ్ ద క్యాపిటలిస్ట్స్’ అనే పుస్తకాన్ని రాయడం గమనార్హం.
విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ పలు బ్యాంకులకు రూ.7,000 కోట్లకుపైగా రుణాలు చెల్లించకుండా మొండిబకాయిదారుగా మారడం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం నాటికి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోని రుణాల్లో మొండిబకాయిలు(పునర్‌వ్యవస్థీకరించిన వాటితో సహా) 10.4 శాతానికి ఎగబాకడం అటు ప్రభుత్వం, ఇటు నియంత్రణ సంస్థల్లో గుబులు పుట్టిస్తోంది.
సమాజంలో ఆగ్రహం...
రుణాల చెల్లింపుల విషయంలో కార్పొరేట్ల నిర్లక్ష్య ధోరణి కారణంగా సమాజంలో ఆందోళనలు పెల్లుబికేందుకు దారితీయొచ్చని కూడా రాజన్ వ్యాఖ్యానించారు. ప్రమోటర్లు, బ్యాంకుల మధ్య కుదిరే రుణ ఒప్పందాలపై మాట్లాడుతూ... బ్యాంకులు కొన్నిసార్లు బడా రుణ గ్రహీతల పలుకుబడి ఇతరత్రా అంశాల వల్ల తలొగ్గాల్సి వస్తుందన్నారు. ‘ప్రమోటర్లు తమ సొంత సొమ్ముతో కాకుండా ప్రజల సొమ్ముతో ఇష్టానుసారంగా వ్యాపారాలను నిర్వహిస్తుంటారు. దీనివల్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది.
దీంతో చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల చిన్న సంస్థలు ఇబ్బందుల్లో పడతాయి’ అని రాజన్ పేర్కొన్నారు. ఎవరైనా బడా రుణ గ్రహీత ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టినా.. లేదంటే బ్యాంకులకు చెల్లింపుల్లో సహకరించకపోయినా దీని అర్థం ఒక్కటే.. పన్ను చెల్లింపుదార్లను దోచుకుంటున్నట్లే లెక్క.
ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అవసరమైన కొత్త పెట్టుబడుల నిధులపై మరింత భారం పడేందుకు దీనివల్ల దారితీస్తుందని రాజన్ పేర్కొన్నారు. 2013-14లో బ్యాంకులు రూ.2.36 లక్షల కోట్ల బకాయిలను వసూలు చేసుకోవాల్సి ఉండగా.. రుణ వసూళ్ల ట్రిబ్యునల్(డీఆర్‌టీ) ద్వారా కేవలం రూ.30,590 కోట్లను మాత్రమే రికవరీ చేసుకోగలిగాయని కూడా రాజన్ తెలిపారు. డీఆర్‌టీల్లో కేసులు పేరుకుపోతున్నాయన్నారు. ఈ విధానపరమైన జాప్యాల కారణంగా బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడుతోందని రాజన్ వివరించారు.
వృద్ధి కోసం రిస్క్ తీసుకోవడానికి రెడీ..
నిలిచిపోయిన ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించగలిగితే మొండిబకాయిలు(ఎన్‌పీఏ)గా మారిన రుణాలను పునర్‌వ్యవస్థీకరించడంలో బ్యాంకులకు మరింత వెసులుబాటు ఇవ్వడానికి సిద్ధమేనని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ‘రుణాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి మరింత వెసులుబాటు కావాలంటూ బ్యాంకులు ఆర్‌బీఐని కోరుతున్నాయి. దీనివల్ల ఎన్‌పీఏల్లో కొంత భాగాన్ని ఆయా కంపెనీల్లో ఈక్విటీగా బ్యాంకులు తీసుకోవాల్సి వస్తుంది.
వివిధ ప్రాజెక్టులకు నగదు ప్రవాహం పెరిగి మళ్లీ గాడిలోపడతాయని... వృద్ధి రేటు రికవరీ బాటలోకి పయనిస్తుందని భావిస్తే ఈ రిస్క్ తీసుకోవడానికి మేం సన్నద్ధంగానే ఉన్నాం’ అని రాజన్ వ్యాఖ్యానించారు. పర్యావరణ సంబంధ అనుమతుల్లో జాప్యం, భూసేకరణ వంటి అడ్డంకుల కారణంగా సుమారు రూ.20 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిలిచిపోయినట్లు అంచనా. దీంతో ఆర్‌బీఐ రుణాల పునర్ వ్యవస్థీకరణ నిబంధనలను కఠినతరం చేసింది.
మరింత మొత్తాన్ని ప్రొవిజనింగ్‌గా పక్కనబెట్టాల్సి రావడంతో బ్యాంకుల లాభాలపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తోంది. ‘2010-11లో 9 శాతంపైగా నమోదైన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 5 శాతం దిగువకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్‌పీఏ సమస్యను సమర్థంగా ఎదుర్కోవడం కోసం బ్యాంకుల నుంచి వస్తున్న డిమాండ్‌లుకూడా సరైనవే. గతంలో ఇలాంటి వెసులుబాటు ఇస్తే చాలా బ్యాంకుల యాజమాన్యాలు దుర్వినియోగం చేశాయి. అందుకే ఆర్‌బీఐ ఈ విషయంలో తటపటాయించాల్సి వచ్చింది’ అని రాజన్ పేర్కొన్నారు.