న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి, విదేశాల పారిపోయిన విజయ్ మాల్యా వ్యవహారంలో రోజుకో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న కాక మొన్న తాను దేశం విడిచి వెళ్లిపోవడానికి కంటే ముందు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసినట్టు మాల్యానే సంచలన విషయం వెల్లడించగా... నేడు టాప్ సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దావే కూడా కీలక విషయాలను తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఫిర్యాదు ఫైల్ చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతోనే, మాల్యా దేశం విడిచిపోయినట్టు పేర్కొన్నారు.
అసలేం జరిగింది...?
విజయ్ మాల్యా భారత్ విడిచి పారిపోవడానికి కంటే సుమారు ఒక నెల ఉమందు, ఈ లిక్కర్ టైకూర్ రూ.2000 కోట్లకు పైగా రుణాలను తమకు చెల్లించాల్సి ఉందని ఎస్‌బీఐ ప్రకటించింది. డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కు సమర్పించే క్రమంలో ఈ విషయాలను వెల్లడించింది. విజయ్ మాల్యా, ఆయన కంపెనీల రుణాల ఎగవేతను ఈ ట్రిబ్యునల్ విచారిస్తోంది. 14 బ్యాంక్‌లను నిర్వహించే కన్సోర్టియం ఎస్‌బీఐ ట్రిబ్యునల్‌కు ఈ వివరాలను సమర్పించింది. 2016 జనవరి 31 వరకు మాల్యా ఎస్‌బీఐకు రూ.2,043 కోట్ల రుణాలు బాకీ ఉన్నారని, మొత్తంగా బ్యాంకులకు రూ.6,963 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. కొన్ని వారాల తర్వాత అంటే ఫిబ్రవరి 28న టాప్ సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దావే, సీనియర్ ఎస్‌బీఐ అధికారులతో భేటీ అయ్యారు. మాల్యా, ఆయన కంపెనీల రుణాల వ్యవహారంలో వెంటనే సమావేశం కావాలని ఎస్‌బీఐ అధికారులు కోరడంతో, ఈ భేటీ నిర్వహించారు. ఆ మీటింగ్ న్యూఢిల్లీలోని దావే ఇంట్లో జరిగింది. గంట పాటు జరిగిన సమావేశంలో మాల్యా భారత్ విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఎస్‌బీఐ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
మాల్యా పారిపోకుండా ఉండాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలని, తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 29న సుప్రీంకోర్టులో అతను భారత్‌ను వీడకుండా ఉండేందుకు ఓ ఫిర్యాదు దాఖలు చేయాలని దవే సూచించారు. అప్పటి ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య కూడా తన సూచనకు అంగీకారం తెలిపినట్లు దావే వెల్లడించారు. అయితే ఆమె ఈ సమావేశంలో పాల్గొన్నారో.. లేదో దుష్యంత్ స్పష్టం చేయలేదు. ఆ తర్వాత రోజు దవే సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ అక్కడి టాప్ ఎస్‌బీఐ అధికారులెవరూ రాలేదు. మాల్యా భారత్ వీడకుండా ఉండేందుకు పిల్‌నూ దాఖలు చేయలేదు. రెండు రోజుల అనంతరం అంటే మార్చి 2న విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాల్యా భారత్‌కు రాలేదు. ప్రస్తుతం లండన్‌లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు. ‘నేను ఎస్‌బీఐ అధికారులకు సూచించిన తర్వాత ఏదో జరిగింది, దానిలో ఏం అనుమానం లేదు’ అని దవే ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దవే స్టేట్‌మెంట్లపై ఎస్‌బీఐ మాజీ చీఫ్ అరుంధతీ భట్టాచార్యా స్పందించారు. దీనిపై ఎస్‌బీఐ అధికార ప్రతినిధి స్పందిస్తారు.తాను స్పందించదలుచుకోలేదని.. ప్రస్తుత యాజమాన్యాన్ని సంప్రదించాలని భట్టాచార్య సూచించారు. మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసుల విషయంలో తమ అధికారులు అలసత్వం ప్రదర్శించారని వస్తున్న ఆరోపణలను ఎస్‌బీఐ ఖండించింది. ఎగవేత మొత్తాలను రికవరీ చేసుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పింది.
టైమ్ లైన్....
- 2016 జనవరి 31 : రూ.2000 కోట్లకు పైగా రుణాలను విజయ్ మాల్యా కలిగి ఉన్నట్టు ఎస్‌బీఐ ప్రకటన
- 2016 ఫిబ్రవరి 28 : మాల్యా రుణాల విషయంపై న్యాయవాది దుశ్యంత్ దవేతో టాప్ ఎస్‌బీఐ అధికారుల భేటీ
- 2016 ఫిబ్రవరి 28 : మాల్యా భారత్‌ను వీడి వెళ్లకుండా ఉండేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించమని సూచన
- 2016 ఫిబ్రవరి 29 : దవే సుప్రీంకోర్టుకు హాజరు, కానీ ఎస్‌బీఐ అధికారులు మాత్రం రాలేదు
- 2016 మార్చి 2 : విజయ్ మాల్యా భారత్‌ను వీడారు.
Comments
Please login to add a commentAdd a comment