డిసెంబర్‌లో మారుతీ అమ్మకాలు జూమ్
హైదరాబాద్: మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు డిసెంబర్ మొదటి రెండు వారాల్లో గణనీయంగా పెరిగాయి. 2013 డిసెంబర్ ఇదే కాలంతో పోల్చిచూస్తే, కొనుగోళ్లు 47 శాతం పెరిగాయి. కొనుగోళ్లపై గరిష్టంగా రూ. లక్ష వరకూ పొదుపు ఆఫర్లను మారుతీ సుజుకీ అమలు చేస్తోంది. పాత కార్లకు సంబంధించి చక్కటి ‘ఎక్స్ఛేంజ్’ ప్రయోజనాలను కూడా సంస్థ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.
అతి తక్కువ డౌన్ పేమెంట్లతో ఆకర్షణీయమైన పథకాలను అందించడానికి ప్రముఖ ఫైనాన్స్ సంస్థలతో మారుతీ అవగాహన కుదుర్చుకుంది. డిసెంబర్ 31వ తేదీతో కేంద్ర ఎక్సైజ్ సుంకం ప్రయోజనం ముగియనుండడం, ఇది కొనసాగించని పక్షంలో ధరలు పెరిగే అవకాశం, ఏడాది చివర్లో స్టాక్స్ క్లియర్‌కు పలు ఆఫర్ల ప్రకటన, వెరసి ఈ నెలలో కొనుగోళ్లపై రూ.50,000- రూ.75,000 శ్రేణిలో పొదుపు అవకాశాలు... వీటన్నింటికీ తోడు వ్యయ భారాలను తట్టుకోడానికి వచ్చే ఏడాది జనవరి నుంచీ సహజంగానే ధరలు పెరిగే అవకాశాలు ఉండడం వంటి అంశాల నేపథ్యంలో కార్ల కొనుగోలుకు డిసెంబర్‌ను ఒక మంచి అవకాశంగా వినియోగదారులు భావిస్తున్నారు.