
ముంబై: దేశంలో మళ్లీ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ– క్యాడ్) భయాలు తలెత్తే పరిస్థితి కనబడుతోంది. 2017–18లో క్యాడ్ మూడు రెట్లు పెరిగింది. గడచిన ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.9 శాతంగా (విలువలో 48.7 బిలియన్ డాలర్లు) నమోదయ్యింది. 2016–17లో క్యాడ్ 0.6 శాతం (విలువలో 14.4 బిలియన్ డాలర్లు) కావడం గమనార్హం.
అంటే ఏమిటి?: ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ)లు మినహా ఒక దేశానికి సంబంధించి విదేశీ మారకద్రవ్యం స్వీకరణ, చెల్లింపుల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. దీనిని జీడీపీ విలువలో ఇంత శాతమని చెబుతారు. క్యాడ్ పెరిగితే ఒక దేశం ప్రపంచ దేశాలకు నికర రుణగ్రస్థ దేశంగా ఉంటుంది. ఇది రూపాయి బలహీనత, ధరల పెరుగుదల వంటి ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. జీడీపీలో క్యాడ్ 5 శాతానికి చేరడంతో 2013 దేశ ఆర్థిక రంగంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రూడ్ ధరల తీవ్రత క్యాడ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
పెరుగుదలకు కారణం..?
దేశం నుంచి ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరగడం దీనితో వాణిజ్యలోటు పెరగడం గత ఏడాది క్యాడ్ పెరుగుదలకు ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి. ఒక్క మార్చి త్రైమాసికంలోనే క్యాడ్ భారీగా 13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment