సాక్షి, ముంబై : బ్యాంకు వినియోగదారులకు షాకింగ్ న్యూస్. అక్రమ లావాదేవీలను నిరోధించేందుకుగాను, ఏటీఏం రోజువారీ లావాదేవీలను నియంత్రించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా బ్యాంక్, ఏటీఎం మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించే దిశగా చర్యలకు దిగనున్నారు. ఈ మేరకు ఢిల్లీ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ (ఎస్‌ఎల్‌బీసీ) కమిటీలో బ్యాంకర్లు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా రోజుకు ఒక్కసారి మాత్రమే ఏటీఎం విత్‌డ్రాయల్‌కు అనుమతించాలని ప్రతిపాదించింది. ఒక్కో ఏటీఎం లావాదేవీకి కనీసం 6 నుంచి 12గంటల వ్యవధి ఉండేలా కొత్త నిబంధనను చేర్చాలని తన నివేదికలో సూచించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగినప్పటికీ, తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే.. వినియోగదారులకు మరోసారి తిప్పలు తప్పవు.
అలాగే ఆయా బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కూడా ఎస్‌ఎల్‌బీసీ సిఫారసు చేసింది. దీంతోపాటు కమ్యూనికేషన్ ఫీచర్‌తో ఏటీఎంలకు సెంట్రలైజ్‌డ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నివేదించింది. ఉదాహరణకు ఎవరైనా హెల్మెట్ పెట్టుకొని ఏటీఎం సెంటర్‌లోకి వెళ్తే ‘‘హెల్మెట్‌ను తొలగించండి’’ అనే వాయిస్ మెసేజ్ వినిపిస్తుంది. అదేవిధంగా, బ్యాంక్ శాఖలలో కూడా, వినియోగదారులు టెల్లర్‌కు దూరంగా ఉండాలని సలహా ఇస్తుంది. అంతేకాదు ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ గార్డ్ నిద్రపోతోంటే కెమెరాతో ఆ ప్రదేశాన్ని కన్నేసి ఉంచేలా సెక్యూరిటీ వ్యవస్థని రూపొందించాలని కోరింది.
కాగా 2018-19 సంవత్సరంలో 179 ఏటీఎం మోసాలతో దేశ రాజధాని నగరం రెండవ స్థానంలో ఉండగా 233 మోసాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గత ఏడాది 911 ఏటీఎం మోసాలతో పోలిస్తే ఈ ఏడాదిలో 980 కి పెరిగాయి. క్లోనింగ్ ద్వారా కూడా ఏటీఎం మోసాలు నమోదుగా భారీగానే ఉంటోంది. ఈ మోసాలకు పాల్పడుతున్న వారిలో విదేశీయులూ ఎక్కువగానే ఉంటున్నారు. ఇప్పటికే ఎస్‌బీఐ ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణను రూ. 20 వేలకు కుదించింది. మరోవైపు రూ. 10 వేలకు మించి విత్‌డ్రా చేసే వారికి ఓటీపీని ఎంటర్ చేయాలని కెనరా బ్యాంకు కూడా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment