డోరేమాన్ కార్టూన్లు.. పిల్లల చానళ్లు! | doraemon cartoon attracting children with adult | Sakshi
Sakshi News home page

డోరేమాన్ కార్టూన్లు.. పిల్లల చానళ్లు!

Published Fri, Mar 21 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

డోరేమాన్ కార్టూన్లు.. పిల్లల చానళ్లు!

డోరేమాన్ కార్టూన్లు.. పిల్లల చానళ్లు!

 న్యూఢిల్లీ: న్యూస్ చానళ్లను మించే వ్యూయర్‌షిప్ .. పెద్దలను కూడా కూర్చోబెట్టేసే ప్రోగ్రామ్‌లు.. ఇలాంటివన్నీ చూసి ప్రస్తుతం చిన్న పిల్లల చానల్స్ బాట పడుతున్నాయి జపాన్ కంపెనీలు. మిగతా చానళ్లకు దీటుగా ప్రకటనలపై భారీగా వెచ్చిస్తున్నాయి. పిల్లల ద్వారా తల్లిదండ్రులతో తమ ఉత్పత్తులను కొనిపించేలా ప్రోత్సహిస్తున్నాయి.

 డోరేమాన్, హెలో కిట్టీ, నింజా వారియర్స్.. ఇలాంటి జపానీస్ కార్టూన్లు, క్యారెక్టర్ల గురించి ప్రస్తుతం పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా టకటకా చెప్పేస్తున్నారు. జపాన్‌కే చెందిన ప్యానాసోనిక్, టయోటా లాంటి ప్రముఖ కంపెనీల గురించైనా తెలియకపోవచ్చునేమో గానీ ఈ కార్టూన్ క్యారెక్టర్లు మాత్రం భారత్‌లో బాగా పాపులర్ అయిపోయాయంటే అతిశయోక్తి కాదు. ఒక రకంగా చెప్పాలంటే.. మిక్కీ మౌజ్, డొనాల్డ్ డక్ లాంటి పాశ్చాత్య కార్టూన్ల ఆధిపత్యానికి డోరేమాన్ వంటి జపాన్ కార్టూన్లు కొంత మేర గండికొట్టగలిగాయి.

వీటి కారణంగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు సైతం కార్టూన్ చానళ్లను చూడటానికి అలవాటుపడిపోతున్నారు. దీంతో జపాన్ అంటే అత్యుత్తమమైనవి మాత్రమే తయారు చేస్తుందన్న భావన పిల్లల్లోనూ పెరుగుతుందని, తద్వారా తమ వ్యాపారాలూ మరింత మెరుగుపడతాయని జపానీస్ కంపెనీలు భావిస్తున్నాయి. పెద్దల దృష్టిని ఆకర్షించేందుకు పెద్ద పెద్ద జపాన్ కంపెనీలు ప్రస్తుతం చిన్న పిల్లల కార్టూన్ చానళ్ల వైపు మళ్లుతున్నాయి.
 
 సోనీ నుంచి శాంసంగ్ దాకా...
 పిల్లల చానళ్లకి ఉన్న శక్తిని గుర్తించి.. జపాన్ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు సైతం  కార్టూన్లపై ఆధారపడుతున్నాయి. సోనీ లాంటి వాటితో పాటు కెమెరాలు, సంబంధిత పరికరాలు తయారు చేసే కెనాన్ మొదలైన దిగ్గజాలు  పిల్లల చానళ్లలో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. డోరేమాన్, హెలో కిట్టీ లాంటి కార్టూన్ క్యారెక్టర్లతో సోనీ కంప్యూటర్స్ గేమింగ్ కన్సోల్స్, సాఫ్ట్‌వేర్ వంటి ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ పరిణామాలతో మారుతీ సుజుకీ, హోండా, గ్లాక్సోస్మిత్‌క్లెయిన్, హిందుస్తాన్ యూనిలీవర్, శాంసంగ్ తదితర సంస్థలు సైతం తమ విక్రయాలను మెరుగుపర్చుకునేందుకు డోరేమాన్ వంటి కార్టూన్ క్యారెక్టర్ల సాయం తీసుకుంటున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

 గణాంకాలు చెబుతున్నాయ్..
 దాదాపు 75 శాతం మంది తల్లిదండ్రులు వారంలో కనీసం అయిదారు సార్లయినా పిల్లలతో కలిసి టీవీ చూస్తారని కార్టూన్ నెట్‌వర్క్ కొన్నాళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.  కాస్త పెద్ద పిల్లలతో కలిసి టీవీ చూసే వారి విషయానికొస్తే 80 శాతం దాకా ఉన్నారు. ఈ విభాగం ఇంత భారీగా పెరుగుతున్నప్పటికీ.. దీని ప్రయోజనాలను కంపెనీలు పూర్తిగా వినియోగించుకోవడం లేదని చానల్స్ అంటున్నాయి. వ్యూయర్‌షిప్ ఏడు శాతం స్థాయిలో ఉన్నా.. మొత్తం ఆదాయాల్లో వీటి వాటా మూడు శాతం మాత్రమే ఉంటోందంటున్నాయి. న్యూస్ చానళ్లను మించిన వ్యూయర్ షిప్ ఉంటుండటంతో అడ్వర్టైజర్లు ప్రస్తుతం పిల్లల చానళ్ల వైపు దృష్టి సారిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement