డీటీహెచ్‌కు పెరుగుతున్న ఆదరణ
⇒ టాటా స్కై చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ మలయ్ దీక్షిత్
⇒ మార్కెట్లోకి టాటాస్కై ‘నా 99’ స్కీం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ టీవీ ప్రసారాలు వేగంగా విస్తరిస్తున్నాయని, మూడేళ్లలో టీవీ ఉన్న కుంటుంబాల సంఖ్య 20 కోట్లకు దాటుతుందని టాటా స్కై అంచనా వేస్తోంది. ప్రస్తుతం దేశంలో టీవీ కలిగిన కుటుంబాల సంఖ్య 14 కోట్లుగా ఉందని టాటా స్కై చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ మలయ్ దీక్షిత్ తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సగటు చందాదారుని ఆదాయంలో ఏటా 20 శాతం వృద్ధి నమోదవుతోందన్నారు. రెండేళ్ళ క్రితం చందాదారుడు నెలకు చెల్లిస్తున్న సగటు అద్దె రూ. 200 ఉండగా ఇప్పుడిది రూ.250కి చేరిందన్నారు. ప్రపంచదేశాల సగటుతో పోలిస్తే భారతీయులు చెల్లిస్తున్న అద్దె చాలా తక్కువని అన్నారు. 2018 నాటికి సగటు చందాదారుడు చెల్లించే నెల అద్దె రూ. 320 నుంచి రూ. 350కి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు ఆయన ‘నా 99’ స్కీంను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఇది బేసిక్ స్కీమ్. దీనికింద చందాదారుడు నెలకు రూ.99తో తెలుగు, ఇతర భాషలు, ఇంగ్లీష్ న్యూస్, స్పోర్ట్స్, సినిమాలు ఇలా కావల్సిన చానల్స్‌ను ప్యాకేజీల రూపంలో తీసుకోవచ్చు.