జనవరి నుంచి డిజిటల్ టీవీ ప్రసారాలు
సాక్షి, హైదరాబాద్: జనవరి 1 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో కేబుల్ టీవీ ప్రసారాలు పూర్తిస్థాయి డిజిటల్ రూపంలోకి మారనున్నాయి. దీంతో ఇక ప్రతి కేబుల్ టీవీకీ సెట్‌టాప్ బాక్స్ లేదా డీటీహెచ్ ఏర్పాటు తప్పనిసరిగా మారింది. ఇందుకు టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. ఇప్పటికే కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్‌ల ఏర్పాటు కోసం రెండు విడతలుగా గడువు విధించి.. అనలాగ్, డిజిటల్ రెండు రకాల ప్రసారాలకూ వెసులుబాటు కల్పించింది.
తాజాగా మూడో విడత గడువు విధించి పూర్తిస్థాయి డిజిటలైజేషన్ అమలుకు మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల (ఎమ్‌ఎస్‌ఓ)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనలాగ్ ప్రసారాలను జనవరి నుంచి పూర్తిగా నిలిపేస్తూ కేవలం డిజిటల్ ప్రసారాలు మాత్రమే అందించేందుకు ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 25 లక్షల టీవీ కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో ఎమ్‌ఎస్‌వోగా ఉన్న సిటీ కేబుల్, హాత్‌వే, డీజీ కేబుల్, ఆర్‌వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ సంస్థలు కేబుల్ ప్రసారాలు అందిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సంస్థలు తమ కేబుల్ ఆపరేటర్ల ద్వారా సుమారు 13 లక్షల వరకు సెట్‌టాప్ బాక్స్‌లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇవికాక సుమారు నాలుగు లక్షల వరకు డీటీహెచ్‌లు ఉన్నాయి. దీంతో ఇప్పటివరకు నగరంలో 68 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది. సెట్‌టాప్ బాక్స్‌లను దాని శ్రేణిని మట్టి రూ.1,100 నుంచి 1,600 వరకు విక్రయిస్తున్నారు.