వాషింగ్టన్: విదేశీయులు అమెరికాలో స్థిరపడేందుకు అత్యంత సులభమైన మార్గంగా భావించే ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును డిసెంబర్ 22 వరకు పొడిగించారు. హెచ్–1బీ వీసా పొందటం కష్టతరమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం భారతీయులు సహా అనేక దేశాల ప్రజలు... గోల్డెన్ వీసాగా పేరుగాంచిన ఈబీ–5 వీసాకే దరఖాస్తు చేసుకుంటున్నారు.
1990లో అమెరికా కాంగ్రెస్ ఈబీ–5 వీసా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అమెరికాలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కొన్ని చోట్ల లక్షిత ఉపాధి ప్రాంతాల (టీఈఏ–టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియాస్)ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో 5 లక్షల డాలర్ల పెట్టుబడి లేదా టీఈఏ కిందకు రాని ప్రాంతాల్లో 10 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టి కంపెనీలను స్థాపించి కనీసం పది మందికి ఉపాధి కల్పించగలిగిన విదేశీయులకు ఈ వీసాలు మంజూరుచేస్తారు.
వీసాలు పొందిన వారికి తొలుత గ్రీన్ కార్డు ఇచ్చి ఆ తర్వాత చాలా తొందరగానే పౌరసత్వం కూడా ఇస్తారు. ఈ కేటగిరీ కింద వీసాకు దరఖాస్తు చేస్తున్న భారతీయుల్లో 74% మంది అభ్యర్థులు నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. మరికొందరు ఆతిథ్య రంగంపై ఆసక్తిగా ఉన్నారు. అమెరికా వర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా భారీ సంఖ్యలోనే ఈబీ–5 వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment