కొత్త బ్యాంకులకు లైన్ క్లిమర్ | EC allows RBI to grant new bank licences | Sakshi
Sakshi News home page

కొత్త బ్యాంకులకు లైన్ క్లిమర్

Published Wed, Apr 2 2014 1:17 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

కొత్త బ్యాంకులకు లైన్ క్లిమర్ - Sakshi

కొత్త బ్యాంకులకు లైన్ క్లిమర్

న్యూఢిల్లీ: దేశంలో కొత్త బ్యాంకుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కు బ్యాంకింగ్ లెసైన్స్‌ల జారీకి అనుమతిస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) ఆమోదముద్ర వేసింది. దీంతో గత కొద్దివారాలుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. ‘కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లకు సంబంధించి తగిన చర్యలు(జారీ చేసేందుకు సూత్రప్రాయ అనుమతి) చేపట్టడం సహేతుకమేనని భావిస్తున్నాం’ అని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ఈసీ మంగళవారం రాసిన లేఖలో స్పష్టం చేసింది. వాస్తవానికి గత నెల చివరికల్లా కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇవ్వాలన్న ఆర్‌బీఐ గడువు ముగిశాక ఈసీ గ్రీన్‌సిగ్నల్ లభించడం గమనార్హం.


 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లెసైన్స్‌ల జారీ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చా.. లేదా అనేదానిపై మార్గనిర్ధేశం చేయాలంటూ ఈసీకి గత నెల 13న ఆర్‌బీఐ లేఖ రాయడం తెలిసిందే. దీనిపై కమిషన్ కొన్ని వివరణలు కోరగా, దానికి ఆర్‌బీఐ సమాధానం కూడా ఇచ్చింది. దీన్ని పరిశీలించిన ఈసీ.. ఎట్టకేలకు లైన్‌క్లియర్ చేసింది. కాగా, అంతక్రితం పాలసీ సమీక్ష సందర్భంగా గవర్నర్ రాజన్ మాట్లాడుతూ.. ఈసీ ఆమోదం లభించిన వెంటనే లెసైన్స్‌ల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. ఆర్‌బీఐ కేంద్ర బోర్డులో  చర్చించి సాధ్యమైనంతం తొందరగా లెసైన్స్‌లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని రాజన్ వెల్లడించారు.


 25 కంపెనీల పోటీ...
 గతేడాది జూలైలో కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల కోసం ఆర్‌బీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన మొత్తం 27 కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. అయితే, ఆతర్వాత టాటా గ్రూప్, వేల్యూ ఇండస్ట్రీస్‌లు వైదొలగడంతో ప్రస్తుతం లెసైన్స్‌ల రేసులో 25 కంపెనీలు మిగిలాయి. ఈ జాబితాలో ప్రభుత్వరంగ ఇండియా పోస్ట్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఐఎఫ్‌సీఐ, ఐడీఎఫ్‌సీలు ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగం నుంచి అనిల్ అంబానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్,  శ్రీరామ్ క్యాపిటల్ తదితర కంపెనీలు ఉన్నాయి.

కాగా, దరఖాస్తులను మదింపు చేసిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ.. ఫిబ్రవరిలోనే తన నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. లెసైన్స్‌లకు అర్హత ఉన్న కంపెనీల పేర్లను కూడా నివేదికలో సూచించినట్లు సమాచారం. కాగా, కొత్త బ్యాంకుల ఏర్పాటుకు అత్యధికంగా అవకాశాలున్న సంస్థల్లో ఇండియా పోస్ట్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, ఐడీఎఫ్‌సీలు ముందువరుసలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మొత్తంమీద 4-5 వరకూ కొత్త లెసైన్స్‌లు ఆర్‌బీఐ ఇవ్వొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
 
 చివరిసారిగా దశాబ్దం క్రితం..
 గడిచిన 20 ఏళ్లలో ఆర్‌బీఐ మొత్తం రెండు దశల్లో 12 ప్రైవేటు రంగ బ్యాంకులకు లెసైన్స్‌లు జారీ చేసింది. 1993 జనవరిలో ప్రవేశపెట్టిన మార్గదర్శకాలకు అనుగుణంగా 10 బ్యాంకులకు లెసైన్స్‌లు దక్కాయి.

  వీటిలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్(గతంలో యూటీఐ బ్యాంక్), ఇండస్‌ఇండ్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటివి ఉన్నాయి. కాగా, కొంత కాలం తర్వాత ఈ 10 కొత్త బ్యాంకుల్లో 4(టైమ్స్ బ్యాంక్, సెంచూరియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ పంజాబ్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్) బ్యాంకులు ఇతర బ్యాంకులలో విలీనమయ్యాయి.


     2001లో బ్యాంకింగ్ లెసైన్స్‌ల మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ సవరించింది.


     ఇక చిట్టచివరిసారిగా 2003-04 ఆర్థిక సంవత్సరంలో యస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులకు ఆర్‌బీఐ లెసైన్స్‌లు ఇచ్చింది.
     మూడేళ్లపాటు కసరత్తు అనంతరం 2013 ఫిబ్రవరిలో ఆర్‌బీఐ కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లకు మళ్లీ మార్గదర్శకాలను విడుదల చేసింది.
     దేశంలో 26 ప్రభుత్వరంగ, 22 ప్రైవేటురంగ బ్యాంకులు ఉన్నాయి. వీటితోపాటు 56 రీజినల్ రూరల్ బ్యాంక్(ఆర్‌ఆర్‌బీ)లు కూడా పనిచేస్తున్నాయి. 41 విదేశీ బ్యాంకులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. మరో 46 విదేశీ బ్యాంకులకు భారత్‌లో కార్యాలయాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement