ఐడీబీఐపై జైట్లీతో ఏఐబీఈఏ చర్చలు
చెన్నై: ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రతినిధులు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. బ్యాంకు ఇటీవలి ఆర్థిక సమస్యలకు మొండి బకాయిలే కారణమని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని జైట్లీని కోరినట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరి సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ప్రభుత్వ రంగ స్టేట్ ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా జైట్లీకి మెమోరాండం అందించినట్లు ఆయన వివరించారు.
ఎస్‌బీఐ సర్వీసు నిబంధనలను అనుబంధ బ్యాంకు ఉద్యోగులపై ఏకపక్షంగా రుద్దడం జరుగుతోందని వివరించినట్లు వెంకటాచలం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ పరిధిలో నుంచి అనుబంధ బ్యాంకులను తప్పించాలని కోరినట్లు ఆయన వివరించారు. ఏఐబీఈఏ లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జైట్లీ హామీ ఇచ్చారు. ఏఐబీఈఏ కార్యదర్శి బీఎస్ రాంబాబు, వైస్ ప్రెసిడెంట్లు జేపీ శర్మ, ఎన్ వేణుగోపాల్, జాయింట్ సెక్రటరి డీడీ రస్తోగి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.