సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ అమలవుతున్న క్రమంలో పెన్షన్ ఫండ్ నుంచి 75 శాతం వరకూ విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో గత పదిరోజుల్లో సబ్‌స్ర్కైబర్లు రూ 280 కోట్లు వెనక్కితీసుకున్నారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) వెల్లడించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మేరకు 1.37 లక్షల మంది చందాదారులకు రూ 279.65 కోట్లు చెల్లించామని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది.
ఈపీఎఫ్‌ఓ వద్ద నమోదైన నాలుగు కోట్ల మంది ఉద్యోగులు మూడు నెలల కనీసం వేతనం, డీఏ లేదా ఈపీఎఫ్ మొత్తంలో 75 శాతం ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించని అడ్వాన్స్ కింద పొందవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 26న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి ప్రకటన నేపథ్యంలో అదే నెల 28న ఈపీఎఫ్‌ఓ దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది. సబ్‌స్క్రైబర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొనడంతో క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ కోసం ఈపీఎఫ్‌ఓ నూతన సాఫ్ట్‌వేర్‌తో ముందుకొచ్చింది.
1.37 లక్షల క్లెయిమ్స్ వచ్చాయని, వీటిని ప్రాసెస్ చేస్తున్నామని..పూర్తి కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న క్లెయిమ్స్‌ను 72 గంటల్లో పరిష్కరిస్తామని ఈపీఎఫ్‌ఓ ఓ ప్రకటనలో పేర్కొంది.మరోవైపు కరోనా కట్టడికి లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో అటల్ పెన్షన్ యోజన చందాదారులకు సైతం ఉద్యోగుల వాటాలో పాక్షిక ఉపసంహరణలకు అనుమతించాలని ప్రభుత్వం యోచిస్తోంది. చదవండి : ఈపీఎఫ్‌వోలో జనన ధ్రువీకరణకు ఆధార్
Comments
Please login to add a commentAdd a comment