ఈడీఎల్‌ఐ బీమా మొత్తం 6 లక్షలకు పెంపు..
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) స్కీమ్ కింద ప్రయోజనాన్ని కేంద్రం పెంచింది. ప్రస్తుతం రూ.3.6 లక్షలుగా ఉన్న బీమా మొత్తాన్ని రూ.6 లక్షలకు పెంచింది. దాదాపు 4 కోట్ల మంది చందాదారులకు ఈ ప్రయోజనం అందుతుంది. నిజానికి గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అత్యున్నత స్థాయి నిర్ణయ కమిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) ఈడీఎల్‌ఐ ప్రయోజన పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. అయితే అమలుకు తాజా నోటిఫికేషన్ జారీ అయ్యింది.
సామాజిక భద్రతకు సంబంధించి శిక్షణ, పరిశోధనా శిక్షణ వ్యవహారాల జాతీయ అకాడమీ (ఎన్‌ఏటీఆర్‌ఎస్‌ఎస్)ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీమా ప్రయోజనం పెంపు నోటిఫికేషన్ జారీ విషయం వెల్లడించారు. యాజమాన్యం చందాతో జతపడిన ఈ జీవిత బీమా... ఈడీఎల్‌ఐ స్కీమ్‌ను... ఒకవేళ సంబంధిత ఉద్యోగి ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా ‘రిబేట్ చందాతో’ కొంతకాలం కొనసాగించేలా కసరత్తు చేస్తున్నట్లు గతంలో మంత్రి వెల్లడించారు.