జెట్‌ రేసులో ఇండిగో! | Etihad in the race to acquire Jet Airways | Sakshi
Sakshi News home page

జెట్‌ రేసులో ఇండిగో!

Jul 26 2019 5:22 AM | Updated on Jul 26 2019 5:24 AM

Etihad in the race to acquire Jet Airways - Sakshi

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేట్టున్నాయి. రుణాలు తీర్చలేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఈ సంస్థ కార్యకలాపాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంస్థకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు వాటిని వసూలు చేసుకునేందుకు మార్గంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ వేయడం తెలిసిందే. ఓ పరిష్కార నిపుణుడిని నియమించి, 90 రోజుల్లోపు దీనికి పరిష్కారం కనుగొనాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఎన్‌సీఎల్‌టీ ముంగిటకు చేరిన జెట్‌ ఎయిర్‌వేస్‌పై పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

దేశీయంగా విమానయానంలో అతిపెద్ద వాటా కలిగిన ఇండిగో దివాలా దశకు చేరిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఇందుకోసం ప్రైవేటు ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్‌తో కలసి దివాలా చట్టం (ఐబీసీ) కింద జెట్‌ఎయిర్‌వేస్‌కు బిడ్‌ వేయనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అమెరికాకు చెందిన మరో ప్రైవేటు ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ సైతం జెట్‌ కొనుగోలుకు ముందుకొస్తోంది ఆసక్తిగల ఇతర ఇన్వెస్టర్లతో కలసి జెట్‌ ఎయిర్‌వేస్‌కు బిడ్‌ వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. సమస్యాత్మక కంపెనీల్లో పెట్టుబడులకు అపోలో గ్లోబల్‌ ప్రసిద్ధి చెందిన సంస్థ. ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల కన్సార్షియంను సంప్రదించినట్టు తెలిసింది. ఈ సంస్థ నిర్వహణలో 280 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి.

ప్రాథమిక చర్చలు జరిగాయి...
‘‘ఇండిగో, టీపీజీ క్యాపిటల్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ పట్ల ఆసక్తిగా ఉన్నాయి. లీడ్‌ బ్యాంకర్‌ అయిన ఎస్‌బీఐతో ఇటీవలే ప్రాథమిక చర్చలు కూడా నిర్వహించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న దివాలా ప్రక్రియ కింద ఈ రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్‌ వేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన దేశీయ, అంతర్జాతీయ స్లాట్లపై ఇండిగో ఆసక్తిగా ఉంది. తద్వారా తన మార్కెట్‌ వాటాను కాపాడుకోవాలని భావిస్తోంది. జెట్‌ ప్రివిలేజ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (జేపీపీఎల్‌) పట్ల టీపీజీ క్యాపిటల్‌ ఎక్కువ ఆసక్తితో ఉంది.

ఎందుకంటే జెట్‌ ఎయిర్‌వేస్‌తో పోలిస్తే జేపీపీఎల్‌ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండడమే కాకుండా, గతంలో లాభాలు కూడా చవిచూసింది.స్వతంత్ర సంస్థ అయిన జేపీపీఎల్‌ దివాలా చర్యల్లో భాగంగా లేకపోవడమే ఉన్న అడ్డంకి. ఈ బిడ్డింగ్‌ ప్రక్రియలో జేపీపీఎల్‌ను కూడా భాగం చేయవచ్చా అన్నదానిపై ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జేపీపీఎల్‌ అన్నది జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసుల్లో తరచుగా ప్రయాణించే వారి కోసం ఉద్దేశించిన లాయల్టీ ప్రోగ్రామ్‌.

2012లో జెట్‌ సొంత విభాగంగా ఏర్పాటవ్వగా, 2014లో స్వతంత్ర సంస్థగా మార్చారు. ఆ ఏడాది ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ 150 మిలియన్‌ డాలర్లతో 50.1 శాతం వాటా తీసుకుంది. మిగిలిన వాటా జెట్‌ చేతుల్లో ఉంది. జేపీపీఎల్‌ విలువ రూ.7,300 కోట్లు ఉంటుందని ఆన్‌ పాయింట్‌ లాయల్టీ అనే సంస్థ అంచనా కట్టింది. ఇక, అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ సైతం జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల కన్సార్షియంతో ఇటీవలే సమావేశమైందని, వ్యాల్యూ ఇన్వెస్టర్లుగా జెట్‌ ఎయిర్‌వేస్‌లో మంచి అవకాశం కోసం చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జెట్‌ రుణదాతల కన్సార్షియం ఈ నెల 16న తొలిసారి సమావేశమై చర్చలు కూడా నిర్వహించింది. ఈ వారాంతంలోపు జెట్‌ ఎయిర్‌వేస్‌కు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహ్వానం పలకొచ్చని, బిడ్లు వేసేందుకు ఆగస్ట్‌ మొదటి వారం వరకు గడువు ఇవ్వొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement