బ్రెగ్జిట్‌తో మనకేంటి..?
యూరోపియన్ యూనియన్ నుంచి తప్పుకుంటూ ఈ ఏడాది జూన్ 23న బ్రిటన్ ప్రజలిచ్చిన తీర్పు చరిత్రాత్మకం. ఈ ఫలితం వెలువడ్డ మర్నాడు దేశీ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ ఒకదశలో 1,091 పాయింట్లు పడి.. చివరికి 605 పాయింట్ల నష్టంతో సరిపెట్టుకుంది. ముడిచమురు ధరలు పడిపోగా, బంగారం 5 శాతం ర్యాలీ జరిపింది. పౌండ్ 30 ఏళ్ల కనిష్ట స్థాయికి పతనమైంది. అంతర్జాతీయంగా డాలర్, జపాన్ యెన్ మాత్రమే లాభాల్ని ఆర్జించాయి. అంతర్జాతీయ ఆర్థిక రంగంతో మమేకమైన భారత్‌పై బ్రెగ్జిట్ ప్రభావం కొంతైనా ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల మాట.
బ్రిటన్ దారిలో మరికొన్ని దేశాలూ ఈయూ నుంచి బయటపడాలనుకుంటే మాత్రం మరో ఆర్థిక సంక్షోభం తప్పదన్న అంచనాలున్నాయి. పౌండ్ పతనం కావడంతో ప్రపంచ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానంలో ఉన్న బ్రిటన్ ను భారత్ వెనక్కి నెట్టేసిందన్నది ఫోరŠబ్స్ అంచనా. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ లు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. నిజానికి 2020 నాటికి బ్రిటన్, ఫ్రాన్స్ లను భారత్ అధిగమిస్తుందని ఆర్థిక వేత్తలు లోగడే అంచనా వేశారు.