భారత్, బ్రిటన్‌లకు గొప్ప అవకాశం
► (బెగ్జిట్‌తో మరింత మెరుగైన వాణిజ్య సంబంధాలు
► స్మార్ట్ సిటీలతో బ్రిటన్ కంపెనీలకు 2 బిలియన్ పౌండ్ల వ్యాపారం
► బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి లియామ్ ఫాక్స్
న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంతో భారత్‌తో వాణిజ్య సంబంధాలు మరింత మెరుగయ్యేందుకు గొప్ప అవకాశం లభించిందని బ్రిటన్ పేర్కొంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ తమకు సహజ భాగస్వామి అని తెలిపింది.. భారత ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీ పథకానికి మద్దతు ఇచ్చేందుకు బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్) లియామ్ ఫాక్స్ సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేలా ద్వైపాక్షిక సంబంధాల, పెట్టుబడుల పెంపునకు సానుకూలత వ్యక్తం చేశారు.
మంగళవారమిక్కడ ఇండియా-యూకే టెక్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. స్మార్ట్ సిటీ వంటి ప్రాజెక్టులను అమలు చేయడంలో బ్రిటన్ ఖ్యాతి పొందిందని, ఇంటెలిజెంట్ ట్రాన్‌సపోర్ట్ సిస్టమ్, డాటా అనాలసిస్‌లోనూ ముందుందన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు వల్ల బ్రిటన్ కంపెనీలకు 2బిలియన్ పౌండ్ల వ్యాపారానికి అవకాశం దక్కుతుందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. వాణిజ్యంలో రక్షణాత్మక వైఖరిని విడనాడాలన్నారు.
ప్రణబ్‌తో థెరెసామే భేటీ
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో భారత్, బ్రిటన్ మరింతగా సహకారం అందజేసుకోవాలని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
బెంగళూరు విద్యార్థులతో థెరిసా మే
సాక్షి, బెంగళూరు: థెరెసా మే మంగళవారం బెంగళూరు పర్యటనలో భాగంగా ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సమావేశమయ్యారు. వారితో కలసి భారత వైమానిక దళం నిర్వహించిన విన్యాసాలను తిలకించారు. తరహున్సే గ్రామంలో ఉన్న స్టోన్‌హిల్ గవర్నమెంట్ హయ్యర్ ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు బ్రిటన్ వీసా జారీలో నూతనంగా ప్రవేశపెట్టిన నిబంధనలను సడలించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య థెరెసాను కోరారు. ఆమెతో సీఎం కొద్ది సేపు సమావేశమయ్యారు.