
ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్ బలహీనత... దేశీయంగా ఆర్థిక అంశాల బులిష్‌గా ఉండటం వంటి అంశాలు రూపాయికి బలాన్నిస్తున్నాయి. మంగళవారం వరుసగా నాల్గవ ట్రేడింగ్ సెషన్‌లోనూ రూపాయి బలపడింది. ఐదు గంటలతో ట్రేడింగ్ ముగిసే దేశీయ ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం 20 పైసలు లాభపడింది. అంటే సోమవారం 63.68 వద్ద ముగిసిన రూపాయి మంగళవారం 63.48 వద్దకు చేరింది. ఉదాహరణకు ఒక డాలర్‌కు సోమవారం రూ.63.68 ఇవ్వాల్సి ఉంటే, మంగళవారం రూ.63.48 ఇస్తే సరిపోతుందన్నమాట. రూపాయి గడచిన రెండున్నరరేళ్లలో ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి. 2015 జూలై 17న రూపాయి విలువ 63.47.
ఎందుకిలా పెరిగిందంటే...
కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం నెలకొనటంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు ఫలిస్తాయన్న విశ్వాసమూ ఎక్కువే ఉంది. దీంతో దేశానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఇవన్నీ కలిసి రూపాయి బలోపేతానికి కారణమయ్యాయి. 52 వారాల క్రితం అంటే ఏడాది కిందట... ఏకంగా 68.80 కనిష్ట స్థాయికి చేరిన రూపాయి అందరి అంచనాలకూ భిన్నంగా ప్రస్తుతం 63.48 స్థాయికి బలోపేతం అయ్యింది. అంటే అప్పట్లో రూపాయి బలహీనంగా ఉంది కనక ఒక డాలర్‌కు రూ.68.80 ఖర్చుచేయాల్సి వచ్చేంది. ఇపుడైతే రూ.63.48 చాలు. అంతర్జాతీయ మార్కెట్‌లో 103.50 స్థాయికి చేరిన డాలర్ ఇండెక్స్ కూడా దాదాపు సంవత్సన్నర కాలంలో భారీస్థాయిలో పతనం కావడం రూపాయి పటిష్ఠానికి ప్రధాన కారణాల్లో ఒకటి. గడచిన నాలుగు రోజుల్లోనే రూపాయి 67 పైసలు లాభపడింది. అంతర్జాతీయంగా రెండు నెలల క్రితం డాలర్ ఇండెక్స్ 90.99 స్థాయికి చేరినప్పుడు దాదాపు 63.60 స్థాయికి చేరిన రూపాయి, మళ్లీ డాలర్ ఇండెక్స్ 95 స్థాయికి చేరడంతో తిరిగి దాదాపు 65 స్థాయికి పడింది. ఇప్పుడు మళ్లీ డాలర్ ఇండెక్స్ బలహీనం (ఈ వార్త రసే సమయం రాత్రి 9గంటలకు 91.69 స్థాయిలో ట్రేడవుతోంది. ఇదే సమయంలో రూపాయి 63.46 వద్ద ట్రేడవుతోంది) రూపాయి బలోపేతానికి ప్రధాన కారణాల్లో ఒకటయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment